వివాహ బంధానికి.. కరోనా ఎఫెక్ట్‌

26 Mar, 2020 09:31 IST|Sakshi

సాక్షి, అమలాపురం: కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమమైపోయేంత సామాజిక భద్రతతోపాటు దూరం అనివార్యమైన పరిస్థితుల్లో ముందుగా కుదుర్చుకున్న వివాహాల్లో అయోమయం ఏర్పడింది. ఈ నెల 26,28,29 తేదీల్లో జరగాల్సిన పెళ్లిళ్లకు జిల్లాలోని పలు కుటుంబాలు శుభ లేఖలు కూడా పంచిపెట్టేశారు. అన్నింటికీ ఆర్డర్లు ఇచ్చేసి...అడ్వాన్సులు కూడా చెల్లించేసి పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్నారు. అయితే రోజురోజుకూ కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతుండడంతోపాటు ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఎక్కువ కావడంతో పునరాలోచనల్లో పడ్డారు. జనం అధిక సంఖ్యలో ఒకేచోట సమూహంగా ఉండకూడదన్న ఆంక్షలతో కల్యాణ మండపాల్లో వేడుకలను కూడా రద్దు చేయిస్తున్నారు.

ముమ్మిడివరంలో నాలుగు రోజుల కిందట ఓ కల్యాణ మండపంలో భారీ ఏర్పాట్లతో జరుగుతున్న పెళ్లి  వేడుకలను అధికారులు జరగకుండా అడ్డుకున్నారు. అమలాపురంలో ఈ నెల 28, 29 తేదీల్లో కూడా రెండు కుటుంబాలు నిరాడంబరంగా ఇరు కుటుంబాల నుంచి పది, పదిహేను మంది మధ్య జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా తగ్గిన తర్వాత వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేసి అందరిని ఆహా్వనిస్తామని బంధువులు, శ్రేయోభిలాషులకు వాట్సాప్‌ మెసేజ్‌లు ద్వారా పెళ్లి నిర్వాహకులు పంపించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క అమలాపురంలోనే కాదు జిల్లా అంతటా ఉంది.

ఇప్పటికే ఖాయమైన పెళ్లిళ్లు  నాలుగు నెలలపాటు వాయిదా..
నిశ్చితార్థాలు ముగించుకుని ఏప్రిల్, మే నెలల్లో ముహూర్తాలు పెట్టించుకుందామనుకుంటున్న వారు కరోనా తీవ్రత, ఆంక్షలతో ఆగస్టు నెలకు అంటే దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేసుకుంటున్నారు. అమలాపురం, అంబాజీపేట, రాజోలు, రావులపాలెం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఇలాగే నిశి్ఛతార్ధం చేసుకుని తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నారు.

అడ్వాన్సుల రూపంలో రూ.1.50 కోట్ల నష్టం 
జిల్లాలో కరోనా వైరస్‌ అలజడి వచ్చిన తర్వాత జరగాల్సిన పెళ్లిళ్లు జిల్లాలో దాదాపు 230 వరకూ ఉన్నట్లు తెలిసింది. ఈ పెళ్లిళ్ల కుటుంబాల వారు తమ తమ ఆర్థిక  తాహతును బట్టి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఖర్చులు చేసేవారున్నారు. ఇందులో 65 శాతం కల్యాణ మండపాలను రూ.లక్షలు వెచ్చించి బుక్‌ చేసుకున్నారు. ఇప్పటికే కల్యాణ మండపాలకే కాకుండా బ్యాండ్‌ మేళాలు, భోజనాలు, వంట పాత్రలు,  షామియానాలు, విద్యుద్దీపాలు, వేదికల అలంకరణ, శుభ లేఖల ముద్రణ తదితర ఈవెంట్స్‌కు అడ్వాన్సుల పేరుతో జిల్లా వ్యాప్తంగా రూ.1.50 కోట్ల వరకూ వెచ్చించినట్టు సమాచారం.

ఆగస్టు నుంచి మంచి ముహూర్తాలు
ఇంట్లో పెళ్లికంటే ఇంటిల్లిపాదీ ఆరోగ్యం ముఖ్యం. కరోనాతో ఇప్పుడు పెళ్లిళ్లు బాగా చేసుకోలేకపోతున్నామని...వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఎవరూ నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే ఎలాగూ మే నెల తర్వాత మూడు నెలలు ముహూర్తాలు లేవు. ఆగస్టు నెల నుంచి మంచి మంచి ముహూర్తాలున్నాయి. ఆ ముహూర్తాల్లో ఇప్పటికే నిశి్చతార్ధాలతో కుదుర్చుకున్న పెళ్లిను బాగా చేసుకోవచ్చు. కరోనా వైరస్‌ను సమూలంగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు విధిస్తున్న ఆంక్షలకు మన ఆరోగ్యాం కోసం విలువ ఇద్దాం. ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాలను కాపాడుకుందాం.  – ఉపద్రష్ట నాగాదిత్య, పంచాంగ కర్త, అమలాపురం

మరిన్ని వార్తలు