బతుకు.. బొమ్మలాట

2 Jul, 2020 12:20 IST|Sakshi
పనుల్లేక గుడారంలో దీనంగా ఉన్న చున్నీలాల్‌ కుటుంబ సభ్యులు

బొమ్మల తయారీ కళాకారులకు కరోనా దెబ్బ

లాక్‌డౌన్‌ నుంచి నిలిచిన వ్యాపారాలు 

తినడానికి తిండి లేక అవస్థలు 

పస్తులుంటున్న కుటుంబాలు

జీవకళ తొణికిసలాడే మట్టి బొమ్మలవి. ఇంటికి అందాన్నిచ్చే ఆకృతులవి. కళాకారుల కుటుంబాల ఆకలి తీర్చే కళారూపాలవి. వాటిని నమ్ముకున్న బతుకులకు కరోనా దెబ్బ కొట్టింది. రాష్ట్రాలు దాటి వచ్చిన రాజస్థానీ కళాకారుల్ని పస్తులుంచుతోంది. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి బొమ్మల వ్యాపారం మూతపడింది. ఒక్కటంటే.. ఒక్కటి కొనేవారు లేక.. ఆదాయం రాక.. ఆకలి తీరక అవస్థలు పడుతున్న రాజస్థానీ కళాకారుల దీనగాథ ఇది.           

రామభద్రపురం: రాజస్థాన్‌కు చెందిన చున్నీలాల్‌ కుటుంబ సభ్యులు పది మంది, బచనారామ్‌ కుటుంబ సభ్యులు ఆరుగురు రెండేళ్ల క్రితం రామభద్రపురం మండల కేంద్రానికి వలస వచ్చారు. స్థానిక ప్రభుత్వ పశువైద్యశాల వెనుకనున్న ఓ ప్రైవేట్‌ ఖాళీ స్థలంలో చున్నీలాల్‌ కుటుంబం, బైపాస్‌లోని విశాఖ డెయిరీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బచనారామ్‌ కుటుంబ సభ్యులు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా ఆకర్షణీయమైన బొమ్మలు చేసి, విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు రోజూ రూ.2వేల వరకూ వ్యాపారం సాగింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత వీరి వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఒక్కటంటే ఒక్క బొమ్మను అమ్ముకోలేకపోయారు. తయారు చేసిన బొమ్మలన్నీ అలాగే ఉండిపోయాయి. సాధారణంగా వీటిని దిగుమతి చేసుకునేందుకు అప్పు చేస్తుంటారు. బొమ్మల తయారీకి అనంతపురం, బళ్లారి, బెంగుళూరుకు వెళ్లి అవసరమైన ముడిసరుకును తెచ్చుకుంటారు. ప్రస్తుతం విక్రయాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా వీరంతా చితికిపోయారు. కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా వ్యాపారాలు లేకపోవడంతో తినడానికి తిండిలేక నానా అవస్థలు పడుతున్నారు.


రామభద్రపురం విశాఖ డెయిరీ ఎదురుగా ఉన్న గుడారంలో ఖాళీగా బచనారామ్‌ కుటుంబం   

దాతల కోసం ఎదురుచూపు 
చున్నీలాల్‌కు ఎనిమిది మంది పిల్లలు ఉండగా వారిలో ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో ఒక కుమారుడికి పచ్చకామెర్లు సోకింది. వైద్యం కోసం చుట్టుపక్కల ఉన్న దాతలు కొంతమంది డబ్బులు సేకరించి ఇచ్చి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచి వైద్యం అందించినా ఫలితం లేక మృతి చెందాడు. మిగిలిన పిల్లలంతా ఇక్కడ బతకలేక వేరే ప్రాంతానికి వలస వెళ్లిపోయారు. ఇక్కడ చున్నీలాల్‌ అతని భార్య, ఒక కుమారుడు ఉన్నారు. వారికి ఒక్క పూట కూడా తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. దాతలు సహాయం చేసి ఆదుకోమని వేడుకుంటున్నారు. 

దాతల సాయం కోసం నిరీక్షణ  
లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, అధికారులు ఆదుకున్నారు. ఈ క్రమంలోనే రాజస్థానీయులకూ సరుకులు అందజేశారు. వారు నివాసం ఉన్న ప్రాంతంలో ఉన్న వారు కూడా ఎంతో కొంత డబ్బులు సేకరించి ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు నిత్యం సరుకుల పంపిణీ లేక, దాతలు ఆదుకోక, వ్యాపారాలు సాగక రెండు రాజస్థానీ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 

పస్తులుంటున్నాం
లాక్‌డౌన్‌ కారణంగా నాలుగు నెలలుగా వ్యాపారాలు జరగడం లేదు. చేతిలో డబ్బు లేదు. కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా మారింది. లాక్‌డౌన్‌ కాలంలో  అధికారులు సరుకులను ఇచ్చారు. ఇప్పుడు తిండి లేక పస్తులతో పడుకుంటున్నాం.
 – చున్నీలాల్, రాజస్థానీ కళాకారుడు, రామభద్రపురం 

వ్యాపారం పడిపోయింది 
తయారు చేసిన బొమ్మలు చుట్టుపక్కల పల్లెలకు తీసుకెళ్లి అమ్ముకొని వచ్చేవాళ్లం. ప్రస్తుతం కరోనా కారణంగా ఊళ్లలోకి కొత్తవాళ్లని రానివ్వకపోవడంతో పాటు బొమ్మలు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారం పూర్తిగా నిలిచిపోయి, కుటుంబ పోషణ భారమైంది. ఇప్పటికి రూ.20 వేలు అప్పు చేశాం. ఇంకా ఎవరూ అప్పులు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. 
– బచనారామ్, రాజస్థానీ, రామభద్రపురం  

మరిన్ని వార్తలు