వైద్య సిబ్బందిపై దాడి; తీసుకునే చర్యలు ఇవే..

30 Apr, 2020 20:16 IST|Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల కాంటాక్ట్స్ సర్వే చేస్తున్న సిబ్బందిపై భౌతిక దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి జిల్లా కలెక్టర్లకు తగు ఆదేశాలిచ్చామని తెలిపారు. కరోనా రోగుల మృత దేహాల్ని ఖననం చేసేటప్పుడు.. దహన వాటికలలోనూ ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై దాడులు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టి కొచ్చిందని పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిపై లేనిపోని అపోహలతో వైద్య సిబ్బంది విధులకు ఆటకం కలిగించొద్దని ఆదేశించారు. కాంటాక్ట్‌ల అన్వేషణ పూర్తి చేసి, సంబంధిత వ్యక్తులకు పరీక్షలు చేయటం ద్వారానే వ్యాధి నివారణ త్వరితగతిన సాధ్యమవుతుందన్నారు. వ్యాధి సోకిన పార్దివ దేహాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం స్టెరిలైజ్ చేసి సీల్ చేస్తారని, ఇలాంటి మృత దేహాల్ని పూడ్చటం లేదా కాల్చటం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. ప్రజలందరూ దీన్ని అవగాహన చేసుకోవాలన్నారు.
(‘జేమ్స్..‌ మీరు లేకుండా ఏదీ మాములుగా ఉండదు’ )

సమాజ హితం కోసం నిరంతరం పాటు పడే వైద్య సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలని సూచించారు, కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 22న తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు. బెయిల్‌కు కూడా అవకాశం లేదని పేర్కొన్నారు. దౌర్జన్యకర చర్యలకు పాల్పడినా, ప్రేరేపించినా, ప్రోత్సహించినా 3 నెలల నుంచి అయిదేళ్ల వరకు కారాగార శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా ఉంటుందని తెలిపారు. వైద్య, వైద్యేతర సిబ్బందిని గాయపరిచే వారికి 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలు జరిమాన, నష్టపరిచిన ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా కల్లెక్టర్లకు ఆదేశాలిచ్చామని కేఎస్‌ జవహర్‌ అన్నారు.
(నా భర్త నాతోనే ఉన్నాడు: ఇర్ఫాన్‌ భార్య )

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు