అడ్మిషన్లు చేయలేదా.. మీ సేవలు అక్కర్లేదు!

7 Jun, 2020 08:59 IST|Sakshi
కుటుంబ సభ్యులతో కలిసి అరటి పళ్లు అమ్ముకుంటున్న ఉపాధ్యాయుడు వెంకటసుబ్బయ్య

టీచర్లకు నెల్లూరు నారాయణ విద్యాసంస్థల అల్టిమేటం  

కరోనా నేపథ్యంలో అడ్మిషన్లు ఎలా చేయాలంటూ టీచర్ల ఆవేదన  

ఈ కారణంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 మంది వరకూ తొలగింపు

సాక్షి, నెల్లూరు (టౌన్‌) : అడ్మిషన్లు చేయించని ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని నెల్లూరు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నఫళంగా తమను ఉద్యోగాల్లోంచి తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితేంటని వాపోతున్నారు. కరోనా కారణంగా మార్చి 15 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆ సమయంలో ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పించారు. ఏప్రిల్‌ నెలకు సగం జీతమే ఇచ్చి, మే నెల వేతనాన్ని పూర్తిగా నిలిపేశారు. అదేమని ప్రశ్నిస్తే ఒక్కొక్కరు 7 నుంచి 10 అడ్మిషన్లు చేయిస్తేనే ఇస్తామని లేకుంటే ఆసలు స్కూలుకే రావొద్దని నారాయణ యాజమాన్యం తెగేసి చెప్పింది. ఓ వైపు కరోనా తీవ్రత, మరో వైపు ప్రజలు ఎవరినీ ఇళ్ల దరిదాపులకు రానీయని పరిస్థితిలో అడ్మిషన్‌లు ఎలా చేస్తామని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.  (‘నారాయణ’ ఉపాధ్యాయుల ఆమరణ నిరాహారదీక్ష) 

► నెల్లూరు నగరంలోని స్టోన్‌హోస్‌పేట అరుణాచలం వీధిలో ఉన్న నారాయణ స్కూల్లో ఐదుగురు టీచర్లను ఈ కారణంతో తొలగించడంతో వారు ఇళ్లకే పరిమితమయ్యారు.  

► మినీబైపాస్‌లోని నారాయణ కాన్సెప్ట్‌ స్కూల్లో పనిచేస్తున్న మరో ఏడుగురు టీచర్లకూ స్కూల్‌కు రావొద్దని చెప్పారు.

► ఈ విధంగా జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల్లోంచి 40 నుంచి 50 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించినట్టు చెబుతున్నారు.  వీరిలో కొంత మంది ఇంటి అద్దెలు చెల్లించలేక సొంత ఊర్లకు వెళితే.. మరికొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు.  

► స్టోన్‌హోస్‌పేటలోని ‘నారాయణ’ బ్రాంచిలో పనిచేసిన తెలుగు టీచర్‌ పట్టెం వెంకటసుబ్బయ్య ఇప్పుడు తోపుడు బండిపై అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. ఎంఏ తెలుగు, ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బీఈడీ చదివిన వెంకటసుబ్బయ్య రెండేళ్లుగా నారాయణ విద్యాసంస్థలో పనిచేస్తున్నారు.

► అడ్మిషన్లు చేయలేదన్న కారణంతో తమను ఉద్యోగాల్లోంచి తొలగించడం దారుణమని మరో టీచర్‌ కాటుబోయిన శ్రీనివాసులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు