కరోనా: తగిన వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి

10 May, 2020 18:15 IST|Sakshi

జిల్లాలో పెరుగుతున్న కరోనా బాధితుల రికవరీ వృద్ది రేటు

సాక్షి, కర్నూలు : పెరుగుతున్న కేసులకు అనుగుణంగా, అంతే వేగంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన వ్యూహాలను కూడా సిద్ధం చేసుకోవాలని ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. మధుమిత దూబే తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, క్వారంటైన్ ఇంకా వేగంగా జరగాలని, కాంటాక్టు ట్రేసింగ్‌లో ఎన్‌జీఓల సహకారం కూడా తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో అనుకోనివి జరిగినా.. అటువంటి ఛాలెంజ్‌లను పగడ్బందీగా ఎదుర్కోవడం కోసం.. క్వారంటైన్‌లు, కోవిడ్ కేర్ సెంటర్లు, హాస్పిటల్స్, హ్యూమన్ రిసోర్సెస్ సన్నద్ధతను ఇంకా పెంచుకోవాలని చెప్పారు. కోవిడ్-19 కట్టడికోసం, కొత్త ఛాలెంజ్‌ను‌ ఎదుర్కోవడంలో  కర్నూలు జిల్లా యంత్రాంగం బాగా కృషి చేస్తోందని అన్నారు. వైరస్ కట్టడికి చాలా అంశాల్లో, టెస్టింగ్‌లో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా పని చేస్తోందని తెలిపారు. 

వైరస్‌ కంట్రోల్పై కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, కర్నూలు జిల్లా యంత్రాంగానికి చేయూతనివ్వడానికి వచ్చామన్నారు. జిల్లాలో పరిస్థితులను పూర్తిగా పరిశీలించి, కోవిడ్ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ద్వారా యంత్రాంగానికి సలహాలు, సూచనలు, గైడ్‌లైన్స్ ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడికి పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోవిడ్-19 కేంద్ర బృందం ప్రశంసించింది. ( వారి కోసం పెయిడ్‌ క్వారెంటైన్స్‌‌ : మాధవీలత)

లాక్‌డౌన్ ఎంతో కాలం ఉండదు
లాక్‌డౌన్‌ ఎంతో కాలం ఉండదని, ఏదో ఒక రోజు లాక్‌డౌన్‌ను తీసేస్తారని, సెంట్రల్ టీమ్ సభ్యులు ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సాధూఖాన్ అన్నారు. కరోనా వైరస్‌తో కలిసి జీవించే విధంగా ప్రజల ఆలోచనలో మార్పు తీసుకురావాలని చెప్పారు. కోవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం, కర్నూలు జిల్లా యంత్రాంగం ప్రశంసనీయ కృషి చేస్తున్నారని కొనియాడారు. వైరస్‌పై విజయాన్ని సాధించడానికి తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. (విదేశాల నుంచి వ‌చ్చేవారి వివ‌రాల న‌మోదు)

కరోనా నుంచి కర్నూలు కోలుకుంటోంది!
జిల్లాలో కరోనా బాధితుల రికవరీ వృద్ది రేటు పెరుగుతోంది. తాజాగా 28 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో గత 4 రోజుల నుండి కొత్త కేసుల కంటే డిశ్చా‍ర్జ్‌లు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 267 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్ అయ్యారు. డిశ్చార్చ్ అయిన 28 మందిలో 23 మంది పురుషులు, మహిళలు 5 మంది ఉన్నారు. వీరిలో 60 నుండి 70 ఏళ్ల  మధ్య వయసుగల వారు ఇద్దరు, 40 నుండి 60 ఏళ్ల మధ్య వయసులోపు వారు 12 మంది, 20 నుండి 40 ఏళ్ల లోవు ఉన్నవారు 14 మంది ఉన్నారు. డిశ్చార్చ్ అయిన 28 మంది కరోనా విజేతల్లో కర్నూలు నగర వాసులు 20 మంది, నంద్యాలకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. కరోనాను జయించడం జిల్లా వాసులకు పెద్ద రిలీఫ్ అయింది. 

మరిన్ని వార్తలు