ట్రాన్స్‌జెండర్‌కు పాజిటివ్‌.. ముంబై నుంచి తణుకు

23 May, 2020 10:42 IST|Sakshi

తొలి కరోనా కేసు నమోదు

ఇరగవరం కాలనీలో ట్రాన్స్‌జెండర్‌కు పాజిటివ్‌

ధ్రువీకరించిన జిల్లా ఉన్నతాధికారులు

పశ్చిమగోదావరి, తణుకు/తణుకు అర్బన్‌: లాక్‌డౌన్‌ ప్రకటించి రెండు నెలల కాలంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు నిరంతర పర్యవేక్షణతో పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉంటూ తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల కదలికలపై నిఘా పెట్టారు. అత్యవసర పనులకే అనుమతిచ్చారు. ఉల్లంఘనలకు తావులేకుండా ఎక్కడిక్కడ వాహనాలను తనిఖీ చేశారు. అయినప్పటికీ కరోనా కేసు నమోదైంది. ఇరగవరం కాలనీలో ఒక ట్రాన్స్‌జెండర్‌కు కరోనా నిర్థారణ కావడంతో తణుకు ప్రజలు ఉలిక్కిపడ్డారు. ముంబయి నుంచి హైదరాబాదు మీదుగా ఈనెల 18న తణుకు వచ్చిన ఆమెను హోం క్వారంటైన్‌లోనే ఉంచి రక్తపరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. మొదటి సారిగా తణుకులో కరోనా కేసు నమోదు కావడం కలకలం రేగింది. గురువారం రాత్రి ఆమెను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులో ఉన్న 9 మందికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు పంపించినట్లుగా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.దుర్గామహేశ్వరరావు తెలిపారు. 

ప్రత్యేక నిఘా.. ప్రశాంతంగా ఉన్న తణుకు ప్రాంతంలో కరోనా కేసు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. తణుకు ఇన్‌చార్జి సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వైరస్‌ సోకిన ట్రాన్స్‌జెండర్‌ నివాసం ఉంటున్న ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి ఆయా ప్రాంతాల్లో దారులన్నీ మూయించారు. ముళ్లకంచెలు వేసి రాకపోకలను నిలిపివేశారు. 500 మీటర్లు మేర రెడ్‌జోన్, బఫర్‌ జోన్‌లుగా నిర్ధేశించారు. ఈ ప్రాంతాన్ని కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి, కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, పట్టణ ఎస్సై కె.రామారావులు శుక్రవారం సందర్శించారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.

వైరస్‌ సోకిన వ్యక్తి ఎక్కడ ఎక్కడ తిరిగారు? ఎవరెవరితో కాంటాక్టు అయ్యిరు? ఎవరెవరితో మాట్లాడారనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ జి.సాంబశివరావు, తహసిల్దారు పీఎన్‌డీ ప్రసాద్‌ పర్యవేక్షించారు. 

మరిన్ని వార్తలు