ఆస్పత్రి నుంచి కరోనా అనుమానితురాలి పరార్‌

29 May, 2020 10:05 IST|Sakshi

వెతికి పట్టుకున్న పోలీసులు, తిరిగి ఆసుపత్రికి తరలింపు 

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

సాక్షి, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రి) నుంచి కరోనా అనుమానితురాలు పరార్‌ అయింది. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సులో వెళ్తున్న ఆమెను అదుపులోకి తీసుకుని తిరిగి ఆసుపత్రికి తరలించారు. ఆదోని పట్టణానికి చెందిన 65 ఏళ్ల మహిళతో పాటు మరో ముగ్గురిని గురువారం తెల్లవారుజామున చికిత్స నిమిత్తం స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. 65 ఏళ్ల మహిళకు ఆదోనిలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌–19 లక్షణాలు కనిపించాయి. దీంతో ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష కోసం ఆమెను కర్నూలు తీసుకొచ్చారు. కాగా ఉదయం 8 గంటలకు సెక్యూరిటీ గార్డులు, నర్సింగ్‌ సిబ్బంది లేని సమయం చూసి ఆమె ఆసుపత్రి నుంచి ఉడాయించి బయటకు వచ్చేసింది.

ఆ తర్వాత ఆర్‌టీసీ బస్టాండ్‌లో వేచి ఉండి మధ్యాహ్నం ఆదోని వెళ్లే బస్సు ఎక్కింది. ఆమె ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికి డ్యూటీకి వచ్చిన నర్సింగ్‌ సిబ్బంది చెక్‌ చేసుకోగా ఆ వృద్ధ మహిళ కనిపించలేదు. దీంతో వెంటనే వారు చుట్టుపక్కల గాలించినా ఆమె జాడ కనిపించలేదు. ఈ కారణంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.నరేంద్రనాథ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు గాలించి ఆ మహిళ ఆదోని వెళ్లే బస్సులో ప్రయాణిస్తోందని తెలుసుకున్నారు. ప్యాలకుర్తి వద్ద ఆర్టీసీ బస్సును ఆపి ఆమెను అదుపులోకి తీసుకుని, 108 అంబులెన్స్‌లో తిరిగి ఆసుపత్రికి తరలించారు. 

చదవండి: టీడీపీ ఇన్‌చార్జి మోసం.. మహిళ ధర్నా

ఆసుపత్రి సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం  
ఆసుపత్రిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ ఉన్న రోగులను సూపర్‌స్పెషాలిటీలో బ్లాక్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. కరోనా అనుమానితులను మాత్రం శుశృతభవన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ భవనంలో ఉన్న రోగులు కొద్దిరోజులుగా యథేచ్ఛగా లోపలికి బయటకు తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 8 గంటల సమయంలో సెక్యూరిటి గార్డుల తమ సమస్యల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి గంట పాటు సమ్మె చేస్తున్నారు. ఇదే సమయంలో డ్యూటీలో ఉండే నర్సింగ్‌ సిబ్బంది షిఫ్ట్‌ డ్యూటీ మారుతుంటారు. దీంతో 65 ఏళ్ల కరోనా అనుమానిత వృద్ధురాలు ఆసుపత్రి నుంచి మెళ్లగా బయటకు వచ్చేసింది. ప్రస్తుతానికి కరోనా అనుమానితురాలైనా పరీక్షల అనంతరం ఆమెకు పాజిటివ్‌ ఉందని తేలితే బాధ్యత ఎవరిదన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇందులో ఆసుపత్రిలో సంబంధిత అధికారులతో పాటు కింది స్థాయి ఉద్యోగులూ బాధ్యత వహించాల్సి ఉంటుంది.  

బాధ్యులను సస్పెండ్‌ చేయండి 
కరోనా అనుమానితురాలు ఆసుపత్రి నుంచి తప్పించుకుని వెళ్లిపోయిన ఘటనపై జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, వైద్యుల సహకారంతో ఆమెను వెతికి పట్టుకుని అంబులెన్స్‌లో తిరిగి ఆసుపత్రిలో చేర్చినా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.నరేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే సస్పెండ్‌ చేసి, పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆయన ఆదేశించారు.    

మరిన్ని వార్తలు