కోవిడ్‌ మీమాంస!

17 Feb, 2020 13:38 IST|Sakshi

రూ.10కోట్ల అమ్మకాలపై ప్రభావం  

నిలిచిన మాంసాహార విక్రయాలు

రెస్టారెంట్లు, హోటళ్లు వెలవెల

చికెన్, మటన్‌ అమ్మకాలపై నిషేధం

సంక్షోభంలోకి పౌల్ట్రీ పరిశ్రమ

పశ్చిమగోదావరి, తణుకు : ఆదివారం వచ్చిందంటే చాలు.. మాంసాహార ప్రియుల ఇళ్లల్లో ఘుమఘుమలు ముక్కుపుటాలను తాకుతాయి. కోడి, మటన్, బిర్యానీలు ఇలా దాదాపు అందరి ఇళ్లల్లో ప్రత్యేక వంటకాలు ఉంటాయి. ముక్క లేనిదే ముద్ద దిగని కుటుంబాలు కోకొల్లలు. ఇప్పుడు వారంతా  మాంసాహార రుచులకు దూరమైపోయారు. ‘ముక్క’ పేరు చెబితేనే ఆమడదూరం పారిపోతున్నారు. జిల్లాలో చికెన్, మటన్‌ అమ్మకాలపై కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ ప్రభావం పడింది. సోషల్‌ మీడియాలో మాంసాహారం తినడం వల్లే చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని ప్రచారం జరగడంతో మాంసప్రియులు ఆ పదార్థాలు తినేందుకు వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు వీవీఎన్‌డీ (కొక్కెర వ్యాధి) వైరస్‌ కోళ్లకు సోకుతుండటంతో పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లావాసులు మాంసాహారాన్ని తాత్కాలికంగా తినడం తగ్గించారు.  వారం రోజులుగా జిల్లాలో మాంసాహార విక్రయాలు నిలిచిపోవడంతో అటు వ్యాపారులువ్యాపారులు ఇటు పౌల్ట్రీ యజమానులు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టపోయారు.  

సంక్షోభంలో పౌల్ట్రీ

కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) ఇప్పుడు పౌల్ట్రీ రైతులను కష్టాల్లోకి నెట్టింది. ఈ వైరస్‌ బారిన పడి కోళ్లు చనిపోతున్నాయనే దుష్ప్రచారం చికెన్‌ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా వచ్చే వీవీఎన్‌డీ వైరస్‌ ప్రస్తుతం కోళ్లకు సోకుతుండటంతో అవి మృత్యువాత పడుతున్నాయి. కోడిమాంసం తినడం వల్ల కోవిడ్‌ సోకుతుందనే ప్రచారం జరగుతుండటంతో పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. చికెన్‌ తినడం వల్ల కోవిడ్‌ సోకుతుందని ఎక్కడా నిర్ధారణ కాలేదని, అదంతా తప్పుడు ప్రచారమేనని అధికారులు చెబుతున్నారు. అయినా మాంసాహార ప్రియులు చికెన్‌ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. సాధారణంగా వారంలో నాలుగైదు రోజులు మాంసాహారం తప్పనిసరిగా తినే జిల్లావాసులు రెండు వారాలుగా నోరు కట్టేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో మాంసాహార ప్రియులు రోజుకు సుమారు 2 లక్షల కిలోల చికెన్‌ లాగిస్తారని అంచనా. ఒక్క ఆదివారం రోజునే దాదాపు 4 లక్షల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమ్మకాలు నిలిపివేయడంతో చికెన్, మటన్‌ దుకాణాలు మూతపడ్డాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే చికెన్, మటన్‌ షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. గుడ్డు తినేందుకు కూడా వినియోగదారులు వెనుకంజ వేస్తున్నారు. అందుకే ఎగ్‌ ధర కూడా సగానికి పడిపోయింది. 

తణుకులో మూతపడిన చికెన్‌ దుకాణం
హోటళ్లలో నాన్‌వెజ్‌ బంద్‌
జిల్లాలో వైరస్‌ ప్రభావం లేదని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నా జిల్లా వాసులు వినిపించుకోవడం లేదు. ముక్క కంటే ముందు ఆరోగ్యం ముఖ్యం అంటూ రెండు వారాలుగా మాంసాహారాన్ని దూరం పెట్టారు. జనవరి మొదటి వారంలో ఫారం వద్ద లైవ్‌ (బతికున్న కోడి) కిలో రూ. 90 ఉంటే స్కిన్‌లెస్‌ కిలో మాంసం రూ. 240 వరకు పలికింది. ప్రస్తుతం చికెన్‌ విక్రయాలు అమాంతం పడిపోవడంతో ధరలు కూడా తగ్గిపోయాయి. జిల్లాలోని పట్టణాలు సహా గ్రామాల్లో కూడా చికెన్‌ వినియోగం తగ్గింది. మటన్‌ విక్రయాలపైనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా పడింది.  ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లలో సైతం నాన్‌వెజ్‌ వంటకాలు నిలిపివేశారు. ఫలితంగా రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులతోపాటు పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్ల వ్యాపారం భారీగా తగ్గిపోయింది.

మరిన్ని వార్తలు