కడప లాక్‌డౌన్‌: 31వరకూ స్వీయ నిర్బంధం 

24 Mar, 2020 09:11 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరికిరణ్, చిత్రంలో  ఎస్పీ అన్బురాజన్‌ తదితరులు 

ఇంటికే అందరూ  పరిమితం కావాలి 

కామన్‌ క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు 

ఈనెల 29న ఉచితంగా రేషన్‌ సరఫరా 

కిలో కందిపప్పు కూడా..  వచ్చేనెల 4న పేదలకు  రూ. వెయ్యి అందజేత 

సోషల్‌ మీడియాలో  ఫేక్‌ న్యూస్‌  పోస్ట్‌ చేస్తే కేసుల నమోదు 

సాక్షి, కడప: కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్‌ హరి కిరణ్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన ఎస్పీ అన్బురాజన్‌తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.  తెలిపిన వివరాలివి. 

  • పేదలకు ఈనెల 29వ తేదీన ఉచిత రేషన్, కిలో కందిపప్పు ప్రభుత్వం అందిస్తుంది. 
  • ఏప్రిల్‌ 4న రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1000  ఇస్తుంది. 
  • జాతర్లు, పెళ్లిళ్లు, తిరునాళ్లు, సామూహిక కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం తాత్కాలికంగా రద్దు చేసుకోవాలి.  31 వరకు ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలోనే ఉండాలి. ఏప్రిల్‌ మొదటి వారం వరకు ఉంటే మరింత మేలు. 
  • వివిధ దేశాల్లో పనిచేస్తూ మన జిల్లాకు 2805 మంది వచ్చారు. వీరిలో ఎక్కువ మంది రాజంపేట, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాల్లో ఉన్నారు. వారందరినీ స్వీయ నిర్బంధంలో ఉంచి అవసరం మేర వైద్య సేవలు అందిస్తున్నారు. ఐదు కామన్‌ క్వారంటైన్స్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. 
  • అనుమానాస్పద కేసుల విషయంలో నిర్దారణకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
  • జన సమూహానికి  అవకాశం ఉన్న సినిమా థియేటర్లు, మాల్స్‌ వంటివి తాత్కాలికంగా మూసివేశారు.  
  • స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దయింది. 
  • రైళ్లు, ప్రజా, ప్రైవేటు రవాణా రద్దు చేసినందున ప్రజలు రాకపోకలు చేయవద్దు. ఆటోలకు మినహాయింపు లేదు.  
  • ప్రభుత్వ నియమ నిబంధనలను అమలు చేసేందుకు ప్రతి మండలంలో తహసీల్దార్‌ చైర్మన్‌గా, ఎంపీడీఓ సహ చైర్మన్‌గా, ఎస్‌ఎహెచ్‌ఓ .. వైద్యాధికారి సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేశారు.  
  • గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహనకు అన్ని చర్యలు చేపడుతున్నారు. 
  •  ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు కూడా షిఫ్ట్‌ పద్దతిలో పనిచేస్తారు.  
  •  కలెక్టర్‌ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూము (నెం. 08562–245259, 259179)ఏర్పాటైంది.  
  •  నిత్యావసర సరుకులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక ధరలకు అమ్మితే 1077 లేదా 08562–246344కు తెలియజేయాలి. 
  • వాణిజ్య సముదాయాలను మూసి వేయాలని ఆదేశం. 
  • నిత్యావసర సరుకులు అమ్మే కిరాణా షాపులు, పాలు, కూరగాయలు, మందుల షాపులు, పెట్రోలు బంకులు, గ్యాస్‌ ఏజెన్సీల లాంటి సంస్థలకు మాత్రమే అనుమతి.  
  • అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటికి రాకూడదన్నారు. బయటికి వస్తే సామాజిక దూరం పాటించాలన్నారు. ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లల(పది సంవత్సరాల్లోపు)ను బయటికి పంపకూడదు.  
  • జలుబు, దగ్గు ఉన్నట్లయితే మాస్‌్కలు ధరించాలన్నారు. వాటిని ఐదు గంటలకు మించి వాడకూడదన్నారు. 
  • ఆరోగ్య పరిస్థితుల్లో అవసరమైతే మాత్రమే ప్రతి కేసును విచారించిన తర్వాతనే అనుమతిస్తామన్నారు. ముందుగా నిర్ణయించినవిధంగానే పదవ తరగతి పరీక్షలు యదావిధిగా జరుగుతాయన్నారు. 
  • ఇంతవరకు జిల్లాలో కరోనా కేసుకు సంబంధించి ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. 
  • పదవ తరగతి పరీక్షలు యథాతథం.

జిల్లాలో కామన్‌ క్వారంటైన్‌ కేంద్రాలు 

జిల్లాలో కరోనా వ్యాప్తి నిరోధానికి కామన్‌ క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటికే కడప–తిరుపతి రోడ్డులోని డీఆర్‌డీఏ ట్రైనింగ్‌ సెంటర్‌ (జేఎంజే కళాశాల ఎదురుగా), వైవీయూలోని గెస్ట్‌హౌస్, రీసెర్చి స్కాలర్‌ హాస్టల్స్, చెన్నూరులోని హజ్‌ భవన్‌ను పరిశీలించామన్నారు., 48 గంటల్లో ఇక్కడ అన్ని వైద్య సౌకర్యాలు కలి్పస్తామన్నారు. రాజంపేట, రాయచోటి, పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు ప్రాంతాల్లో కామన్‌ క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కామన్‌ క్వారంటైన్‌ కేంద్రాన్ని 50–100 పడకల సామర్థ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో ఫేక్‌ పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని  హెచ్చరించారు. ఇప్పటికే ప్రొద్దుటూరు, కడపలో ఫేక్‌ న్యూస్‌ పోస్ట్‌ చేయడం వల్ల కేసు నమోదు చేశామన్నారు. విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. క్రమశిక్షణగా అందరూ 20 రోజులు కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి  స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు.

మరిన్ని వార్తలు