కరోనా యాప్‌ రాబోతుంది

28 Mar, 2020 08:35 IST|Sakshi

క్వారంటైన్‌ను విస్మరిస్తున్న వారి కదలికలపై నిఘా 

జీపీఎస్‌ ఏర్పాటుతో పర్యవేక్షణకు పోలీసుల ప్రయత్నం 

వాట్సాప్‌ ద్వారా నిర్దేశిత ప్రాంతాల్లోని వారికి అలర్ట్‌  మెసేజ్‌లు 

సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ప్రభుత్వం సూచనలు విస్మరిస్తున్న వారిని నిలవరించేందుకు పోలీస్‌ యంత్రాంగం ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ప్రధానంగా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో అనుమానితులను క్వారంటైన్‌ చేసినప్పటికీ పలువురు నిర్దేశిత ఇంటిని, ఆసుపత్రిని దాటి వచ్చేస్తున్నారు. తప్పించుకుని పారిపోయిన సంఘటనలూ వెలుగులోకి వచ్చాయి. అలాంటి వారిని గుర్తించి తిరిగి  క్వారంటైన్‌ చేయాల్సి వస్తోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీన్ని కట్టడి చేయడానికి కరోనా యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు గుంటూరు ఐజీ ప్రభాకరరావు చెప్పారు. (కరోనా సోకిందేమోనని దంపతుల ఆత్మహత్య) 

అనుసంధానం ఇలా..  
క్వారంటైన్‌ ఉన్న వారి ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. నిరీ్ణత ప్రాంతాన్ని అధిగమించగానే సంబంధిత పోలీస్‌ ఉన్నతాధికారికి అలర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. తక్షణం ఆ ప్రాంత బాధ్యులైన అధికారికి సూచనలు పంపి క్వారంటైన్‌ను కొనసాగింపజేయడానికి వీలవుతుంది. తొలుత పది మీటర్ల పరిధిలోనే ఉంచాలని భావించినప్పటికీ దాన్ని యాభై లేదా వంద మీటర్ల పరిధి వరకు  విస్తరించాలనే ఆలోచన చేస్తున్నారు.  

  • ఐ ఫోన్‌లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడానికి కూడా పరిశీలనలు చేస్తున్నారు  
  • ఏదైనా నిర్దేశిత ప్రాంతం వరకే ప్రత్యేకంగా మెసేజ్‌ (గ్రూప్‌ మెసేజ్‌ తరహాలో) పంపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఓల్డ్‌ గుంటూరులో 5000 మందికి అలెర్ట్‌ మెసేజ్‌లు పంపాలనుకుంటే అక్కడికే పరిమితమయ్యేలా డేటా మైగ్రేషన్‌ ద్వారా పరిశీలిస్తున్నారు. కరోనా సమాచారమే కాకుండా ప్రజలకు నిత్యం అవసరమైన సమాచారాన్ని కూడా పంపాలనేది ఆలోచనగా ఉంది.  గుంటూరు అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించినట్లు ఐజీ తెలిపారు.  
  • వాట్సాప్‌లలో తప్పుడు సమాచారంతో మెసేజ్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకునేలా వ్యవస్థ ఏర్పాటవుతోందన్నారు.  
  • క్వారంటైన్‌లో ఉండకుండా బయటకు వచ్చిన వారిపైన, విదేశాల నుంచి ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమాచారం ఇవ్వకుండా దాచినట్లయితే వారిపైన కేసులు నమోదు చేయనున్నామన్నారు. వైద్య పరిరక్షణలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఐపీసీ 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయని ఐజీ ప్రభాకరరావు వివరించారు.

మరిన్ని వార్తలు