కుదిపేస్తున్న కోయంబేడు

21 Jun, 2020 08:48 IST|Sakshi

ఒక్క రోజే 26 మందికి కరోనా

408కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య

సాక్షి, విశాఖపట్నం : చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌ విశాఖను కుదిపేస్తోంది. అక్కడ నుంచి మొదలైన కరోనా వైరస్‌ ఇప్పుడు నగరాన్ని చుట్టేస్తోంది. ముఖ్యంగా అప్పుఘర్, ఫిషర్‌మెన్‌ కాలనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దండుబజార్, అనకాపల్లి, మధురవాడ సాయిరాం కాలనీలను శాసిస్తోంది. కోయంబేడు వల్ల ఒక్క అప్పుఘర్‌ ప్రాంతంలోనే మొత్తం 57 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. మొత్తంగా జిల్లాలో శనివారం 26 మందికి వైరస్‌ సోకింది. తాజా కేసులతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 408 కు చేరుకుంది. వీరిలో 199 మంది డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో  207 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో జిల్లాలో మరొకరు మృతి చెందారు. జీవీఎంసీ 45వ వార్డు ఏకేసీ కాలనీ ప్రాంతానికి చెందిన మహిళ కరోనాతో మృతి చెందింది. 

కేసుల వివరాలు ఇలా..
జిల్లాలో శనివారం 26 కేసులు నమోదయ్యాయి. అందులో అప్పుఘర్, ఫిషర్‌మెన్‌ కాలనీలో పది, అనకాపల్లిలో 2, పెదజాలారిపేటలో ఒకటి, చింతపల్లిలో ఒకటి, పరవాడలో ఒకటి, ఐటీఐ జంక్షన్‌లో ఒకటి(కేజీహెచ్‌ వైద్యుడు), సీతమ్మధార నార్త్‌ ఎక్స్‌టెక్షన్‌లో ఒకటి, పెందుర్తి మండలం పోర్లుపాలెంలో ఒకటి, రామ్‌నగర్‌(ఫేకర్‌ లే అవుట్‌)లో ఒకటి, రంగిరీజు వీధిలో ఒకటి, ఎఎస్‌ఆర్‌ నగర్‌లో ఒకటి, ఆదర్శనగర్‌లో ఒకటి, రవీంద్రనగర్‌లో ఒకటి, ఆరిలోవలో రెండు, మధురవాడ(నగరంపాలెం రోడ్డు) ఒక కేసు నమోదయ్యాయి. 

కరోనాతో మరొకరి మృతి
మల్కాపురం (విశాఖ పశ్చిమ): జిల్లాలో కరోనాతో మరొకరు మృతి చెందారు. జీవీఎంసీ 45వ వార్డు ఏకేసీ కాలనీ ప్రాంతానికి చెందిన మహిళ టీబీతో కొంతకాలంగా బాధపడుతోంది. ఈనెల 10న ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి పరీక్షల కోసం వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధాణైంది. అప్పటినుంచి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతి చెందినట్టు జోన్‌–4 జెడ్సీ సింహాచలం ప్రకటించారు. కడసారి చూపుచూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన కుమారులకు నిరాశ ఎదురైంది. దూరం నుంచి భౌతికదేహాన్ని చూపించి, ఆమెకు సంబంధించిన బంగారు వస్తువులను అక్కడ సిబ్బంది అందజేశారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. చదవండి: ‘ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించలేదు’  

జవాన్‌కు పాజిటివ్‌
పరవాడకు చెందిన జవాన్‌కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

కరోనా సోకిన గర్భిణీకి సిజేరియన్‌
దొండపర్తి(విశాఖ దక్షిణ): కరోనా సోకిన గర్భిణీకి విమ్స్‌ వైద్యులు విజయవంతంగా సిజేరియన్‌ చేయడంతో పండంటి పాపకు జన్మనిచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 23 ఏళ్ల గర్భిణీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆమెను విమ్స్‌లో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. శనివారం ఆమెకు వైద్యులు సిజేరియన్‌ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆమె పాపకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సీజేరియన్‌ నిర్వహించిన వైద్యులకు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అభినందనలు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా