కరోనా: ఏపీలో ఒక్కరోజే 17 పాజిటివ్‌

31 Mar, 2020 20:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మహమ్మారి కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్క రోజే 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 40కు చేరుకుంది. మంగళవారం సాయంత్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన వైద్య అరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఈ విషయాలను వెల్లడించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదుకు వెళ్లి వచ్చిన వారితోనే ఒ‍క్కసారిగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయన్నారు.

దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారన్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వారిని, వారి కుటుంబసభ్యులను గుర్తించి వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ సహాయంతో ఢిల్లీ సదస్సు నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నామన్నారు. ఈరోజు ఒక్క రోజే 226 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 17 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో 810 మందికి కరోనా పరీక్షలు జరిపామని.. అందులో 770 మందికి నెగటీవ్‌గా నిర్దారణ అయిందని జవహర్‌రెడ్డి తెలిపారు. 

చదవండి:
‘నిజాముద్దీన్‌’పై కేంద్ర హోంశాఖ దర్యాప్తు
కరోనా: తప్పిన పెనుముప్పు!

మరిన్ని వార్తలు