అనంతపురం: నలుగురు వైద్య సిబ్బందికి కరోనా!

8 Apr, 2020 18:03 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలో నలుగురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌ అని తేలడం కలవరం పుట్టిస్తోంది. మార్చి 26న హిందూపురానికి చెందిన 68 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో అనంతపురం జీజీహెచ్‌లోని జనరల్‌ వార్డులో మృతి చెందాడు. ఆయనకు చికిత్స అందించిన 29 మంది జీజీహెచ్‌ సిబ్బందిని అదేరోజు క్వారంటైన్‌కు తరలించారు. అందులో నలుగురు వైద్య సిబ్బంది కోవిడ్‌-19 బారినపడ్డారని వైద్యాధికారులు బుధవారం వెల్లడించారు. మిగతా 25 మంది సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్‌ చెప్పారు.
(చదవండి: కరోనా పోరు: బీసీజీ టీకాతో భారత్‌కు ఎంతో మేలు!)

ఇక కొత్తగా నమోదైన కేసులతో అనంతపురంలో కేసుల సంఖ్య 13కి చేరడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్యులందరికీ పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశామని అనిల్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో వైద్య సిబ్బంది, పరికరాల కొరత లేదని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చి వారు కరోనా మోసుకురాడంతో.. వారితో సన్నిహితంగా ఉన్న వారు వైరస్‌ బారినపడ్డారని తెలిపారు. వైద్య సిబ్బంది అనంతపురం, హిందూపురం, లేపాక్షి, కళ్యాణదుర్గం ప్రాంతాలకు చెందినవారు.
(చదవండి: జ‌ర్న‌లిస్ట్ మృతికి సీఎం జ‌గ‌న్ సంతాపం)

మరిన్ని వార్తలు