కర్నూలులో 403 మంది కరోనా విజేతలు

18 May, 2020 09:36 IST|Sakshi
నంద్యాల శాంతిరామ్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతున్న కోవిడ్‌ విజేతలు

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కంటే కర్నూలు జిల్లాను కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ తీవ్రంగా భయపెట్టింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల మనోధైర్యం ముందు కరోనా తోక ముడుస్తోంది. తాజాగా మరో 28 మంది కోవిడ్‌ను జయించి..ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కోవిడ్‌ విజేతల సంఖ్య 403కు చేరుకుంది. ఇది మొత్తం కేసుల్లో 71 శాతంగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 159 మంది (26 శాతం) మాత్రమే చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం కర్నూలు చైతన్య కాలేజీ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుంచి ఏడుగురు, నంద్యాల శాంతిరామ్‌ జిల్లా స్థాయి ప్రభుత్వ కోవిడ్‌ ఆసుపత్రి నుంచి 14 మంది, కర్నూలు సమీపంలోని విశ్వభారతి కోవిడ్‌ ఆసుపత్రి నుంచి ముగ్గురు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. (ఫలిస్తున్న నియంత్రణ చర్యలు )

వీరికి వరుసగా రెండు పరీక్షల్లో నెగిటివ్‌ ఫలితం రావడంతో వైద్యులు, అధికారులు చప్పట్లతో అభినందించి ఇంటికి పంపించారు. ఇందులో 15 మంది పురుషులు, 13 మంది స్త్రీలు ఉండగా.. కర్నూలు నగర వాసులు 14 మంది, నంద్యాల వాసులు 12 మంది, కోవెలకుంట్ల, చాగలమర్రికి చెందిన ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ 50 నుంచి 70 ఏళ్ల వయసు కల్గిన వారు 10 మంది ఉండటం విశేషం. డిశ్చార్జ్‌ అయిన వారికి ఒక్కొక్కరికి రూ.2వేల నగదు ఇచ్చి ప్రత్యేక అంబులెన్స్‌లో ఇంటికి పంపించినట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. 

మరో ముగ్గురికి పాజిటివ్‌ 
జిల్లాలో తాజాగా మరో ముగ్గురు వ్యక్తులకు కరోనా  నిర్ధారణ అయ్యింది. వీరిలో కర్నూలు నగరానికి చెందిన ఇద్దరు, ఆదోనికి చెందిన ఒకరు ఉన్నారు. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 611కు చేరుకుంది. అలాగే కర్నూలు నగరంలో బాధితుల సంఖ్య 388కి చేరగా.. వీరిలో ఇప్పటి వరకు 243 మంది కోలుకున్నారు. 

మరిన్ని వార్తలు