నెల్లూరులో 64కి చేరిన కరోనా కేసులు

18 Apr, 2020 10:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తాజాగా నమోదైన కేసు ప్రకాశం జిల్లా వాసిది 

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో శుక్రవారం తాజాగా ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. అతను ప్రకాశం జిల్లా రావినూతలకు చెందిన 75 ఏళ్ల ఆర్‌ఎంపీ వైద్యుడు. అక్కడే పలువురికి వైద్యం చేసేవాడు. ఆయన కుమారుడు కోవూరు లక్ష్మీపురంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆయన అక్కడ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుమారుడు రావినూతలకు వెళ్లి తన తండ్రిని కోవూరుకు కారులో తీసుకొచ్చాడు. అక్కడ నుంచి పొగతోటలోని ఒక ఆస్పత్రికి ఆటోలో తీసుకెళ్లాడు. ఒక రాత్రి అక్కడే ఉంచుకున్న వైద్యులు కరోనాగా అనుమానించి నారాయణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా,  పాజిటివ్‌ వచ్చింది. అంతలోనే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి సీరియస్‌ కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆ వ్యక్తిని కోవూరు నుంచి నెల్లూరుకు తీసుకొచ్చిన ఆటోలో మరో ఇద్దరు గర్భిణులు రెండు రోజుల్లో విడి విడిగా ప్రయాణించారు. అందులో ఒక గర్భిణికి శుక్రవారం కాన్పు డేట్‌ ఇచ్చి ఉన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఆటోలో ప్రయాణించిన నేపథ్యంలో ఆటోడ్రైవర్‌ను, ఇద్దరు గర్భిణులను, పాజిటివ్‌ సోకిన కుటుంబ సభ్యుల మొత్తాన్ని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని కలుపుకుంటే జిల్లాలో మొత్తం 64 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరు కోలుకుని డిశ్చార్జి కాగా మరో ఇద్దరు మరణించారు. దీంతో యాక్టివ్‌ కేసులు 61 ఉన్నాయి. వీరందరినీ ఐసొలేషన్‌లో ఉంచి డాక్టర్లు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.    

నిరంతర పర్యవేక్షణకు మూడు టీములు
తడ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెడ్‌జోన్‌లో ఉన్న బీవీపాళెం గ్రామంలో నిరంతరం పర్యవేక్షణకు శుక్రవారం నుంచి మూడు టీములను అధికారులు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, గృహనిర్మాణ శాఖ అధికారులను మూడు టీములుగా ఏర్పాటు చేసి గ్రామస్తులు బయటికి వెళ్లకుండా అవసరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ఇప్పటికే పాజిటివ్‌ వచ్చినవారి కుటుంబ సభ్యులు ఎవరెవరిని కలిశారు, వారికి సంబంధించి తాజా ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. 


సేవలకూ అనుమతి తీసుకోవాల్సిందే
నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు, రాజకీయపార్టీల నేతలు ప్రజలకు ఉచిత సేవలందించేందుకు సైతం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి్సందేనని జేసీ వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్నదానం, కూరగాయలు, బియ్యం తదితరాలను ఉచి తంగా పంపిణీ చేసేటప్పుడు భౌతికదూరం పాటించకపోవడం, ఒకేచోట గుమికూడటం వల్ల ఇతర జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు వచ్చినట్టు తెలుస్తోందన్నారు. దీని ద్వారా మంచికి బదులు చెడు చేసినట్టు అవుతుందన్నారు. కనుక సేవ చేయదలచిన వారు తప్పనిసరిగా తహసీల్దార్, ఆర్డీఓ అనుమతి తీసుకోవాలన్నారు. అప్పుడు పోలీసులు కూడా అక్కడికి వచ్చి ప్రజలు భౌతికదూరం పాటించేలా చూస్తారన్నారు.

ఆస్పత్రుల్లో అత్యవసర సేవలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉందన్నారు. అలాగే పశువుల మందుల దుకాణాలు, పశు వైద్యసేవలకు మినహాయింపు ఉందన్నారు. మెడికల్‌ షాపులు, వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్‌ పరికరాలు విక్రయించే హోల్‌సేల్‌ షాపులు, బియ్యం గోదాములు, గోదాముల్లో పని చేసే కార్మికులకు, అక్కడికి వెళ్లే వాహనాలకు, వ్యక్తిగత డ్రైవర్లకు సైతం లాక్‌డౌన్‌ వర్తించదన్నారు.

అలాగే ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ అంత్యక్రియల్లో ఎక్కువ మంది పాల్గొనేందుకు అనుమతి లేదని, అతి తక్కువ మంది మాత్రమే భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనాలని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలను 3 సార్లు రివైజ్డ్‌ చేశామని, ప్రకటించిన రేట్ల కన్నా అధికంగా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు