రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 830

19 May, 2020 03:49 IST|Sakshi

ఇప్పటి వరకు కరోనాను జయించినవారు 1,552

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 830 ఉన్నాయి. సోమవారం ఒక్క రోజే 96 మంది డిశ్చార్జ్‌ అవడంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,552కు చేరింది. రికవరీ రేటు కూడా 63.82 శాతానికి పెరిగింది. గుంటూరు జిల్లాలో 40, కర్నూలు జిల్లాలో 28, కృష్ణా 10, చిత్తూరు 5, తూర్పుగోదావరి 4, విశాఖపట్నం 4, అనంతపురం 2, వైఎస్సార్‌ జిల్లాలో ఒకరు చొప్పున మొత్తం 94 మందితో పాటు, గుజరాత్‌ నుంచి వచ్చిన ఇద్దరు వలస కార్మికులు డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో వలస కార్మికుల్లో కోలుకున్న వారి సంఖ్య 25కి చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకు మొత్తం 9,713 మందికి పరీక్షలు నిర్వహించగా 52 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వాటిలో 19 కేసులు తమిళనాడు కోయంబేడుకు వెళ్లివచ్చినవారివే. 

ఒక్క శాతం దిగువకు పాజిటివ్‌ రేటు
► రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,48,711 మందికి పరీక్షలు నిర్వహించగా 2,432 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 
► వీటిలో 150 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలవే. 
► రాష్ట్రంలో ఇన్ఫెక్షన్‌ రేటు 0.98 శాతానికి పడిపోయింది. 
► కొత్తగా ఎటువంటి మరణాలూ నమోదు కాకపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 50 వద్ద స్థిరంగా ఉంది.

మరిన్ని వార్తలు