ప్రజలంతా సహకరించాలి 

24 Mar, 2020 03:43 IST|Sakshi
మాట్లాడుతున్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. చిత్రంలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గరే తక్కువగా వైరస్‌ వ్యాప్తి  

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు  

ప్రైవేటు ఆస్పత్రులను కూడా భాగస్వాములను చేస్తాం 

మీడియాతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని 

సాక్షి, కాకినాడ: కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కోరారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సహకారంతోనే కోవిడ్‌ను నియంత్రించగలమని, ఆ దిశగా ప్రజలు సైతం స్వీయ నిర్బంధం పాటించినప్పుడే సత్ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. రాష్ట్రంలో నమోదైన ఆరు కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 

ఆళ్ల నాని ఇంకా ఏమన్నారంటే.. 
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉంది. కోవిడ్‌ విస్తరించకుండా వైఎస్‌ జగన్‌ గట్టి చర్యలు తీసుకుంటున్నారు.  
ఇప్పటివరకు విదేశాల నుంచి 13,301 మంది వచ్చినట్లు గుర్తించి వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాం. వారిలో 2,221 మంది 20 రోజుల వైద్యుల పర్యవేక్షణ పూర్తి చేసుకున్నారు. 
11,026 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండగా.. 54 మంది వివిధ ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. 178 మంది శాంపిల్స్‌ను టెస్ట్‌కు పంపాం. ఇందులో 150 నెగెటివ్‌  వచ్చాయి. ఆరు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 22 కేసులకు సంబంధించి ఇంకా రిపోర్టులు రావాల్సి ఉంది.  
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు ఆస్పత్రులను కూడా ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగస్వాములను చేస్తాం.  
కోవిడ్‌ బారినపడ్డవారికి రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 14 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.  
108 సిబ్బందికి అవసరమైన పరికరాలు, వస్తువులు అందించడంతోపాటు వారికి మనో ధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకుంటున్నాం.  
నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసినా కేసులు నమోదు చేస్తాం. 
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు