కరోనాపై పోరాటం: రంగంలోకి ‘మాయల ఫకీరు’

2 Apr, 2020 20:21 IST|Sakshi

సాక్షి, అనంతపురం: కరోనా వైరస్‌పై ప్రజలను అనంతపురం జిల్లా పోలీసులు జాగృతం చేస్తున్నారు. కరోనా వైరస్ లక్షణాలు, వ్యాప్తి, ముందస్తు జాగ్రత్తలుపై పలు రూపాల్లో అవగాహన చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్తున్నారు. కరోనా వైరస్ గురించి మారుమూల గ్రామీణుల్లో సైతం క్షుణ్ణంగా అవగాహన కలిగేలా తమవంతు కృషి చేస్తున్నారు. 

ఇప్పటి వరకు ఫ్లెక్సీలు, దండోరాలు, వాహనాల్లో మైకులు ద్వారా అవగాహన చేసిన పోలీసులు తాజాగా మరో ముందుడుగు వేశారు. వినూత్న వేషధారణ(మాయల ఫకీరు), ప్రచార రథంతో ప్రజల్లో చైతన్యం తీసుకరావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సిద్ధం చేసిన వినూత్న వేషధారితో పాటు ప్రచార రథాన్ని జిల్లా అదనపు ఎస్పీ జి రామాంజనేయులు స్థానిక టవర్ క్లాక్ వద్ద గురువారం ప్రారంభించారు.

జిల్లా ఏ.ఆర్ విభాగంలో పని చేస్తున్న కానిస్టేబుల్ కిశోర్ కుమార్ కు వినూత్న వేషధారణ చేయించారు. మాయల పకీర్ తరహాలో దుస్తులతో పాటు తలపై టోఫన్ కు కరోనా నమూనా ఉట్టిపడేలా వేషధారణ చేయించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రంగంలోకి దింపారు. ఇతనితో పాటు ప్రచార వాహనానికి ముందు మరియు రెండు వైపులా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలుపై ప్రజలకు అవగతమయ్యేలా ఫ్లెక్సీలు తగలించి క్షేత్ర స్థాయికి పంపుతున్నారు. 

అంతేకాకుండా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలు మరియు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు గురించి ఆడియో రూపొందించి మైకు ద్వారా అవగాహన చేస్తున్నారు. నిత్యావసరాల కోసం సడలించిన సమయంలో జన సమ్మర్ధమైన కూరగాయల మార్కెట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రొవిజన్స్ స్టోర్స్ , ప్రధాన కూడళ్లలో ఈ వాహనం మరియు వినూత్న వేషధారి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సడలింపు సమయం ముగిశాక వీధుల్లోకి వెళ్లి జన సమూహాలు లేకుండా మరియు కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని చైతన్యం చేస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ జి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలతో కరోనా గురించి ప్రజల్లో హత్తుకు పోయేలా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జనసంచారం ఉన్న ప్రాంతాలలో ఈ వేషధారి, ప్రచార రథం సంచరించి ప్రజల్ని జాగృతం చేస్తారన్నారు. ప్రజలు ఇందుకు సహకరించి లాక్ డౌన్ నిబంధనలు పాటించడంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి రామకృష్ణ ప్రసాద్ , అనంతపురం డీఎస్పీ వీర రాఘవ రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పి మున్వర్ హుస్సేన్ , జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , నగర ఇన్స్పెక్టర్లు ప్రతాప్ రెడ్డి , జాకీర్ హుస్సేన్ ఖాన్ ,రెడ్డప్ప, కత్తి శ్రీనివాసులు, ఆర్ ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

చదవండి:
‘మతం వద్దు.. మానవత్వమే ముద్దు’
ఏపీలో 143కు చేరిన కరోనా కేసులు

మరిన్ని వార్తలు