రాష్ట్ర సరిహద్దులు మూత

25 Mar, 2020 05:03 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లాలోని ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు

పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలన్నీ బంద్‌

అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి

సాక్షి, అమరావతి: ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర సరిహద్దులను మంగళవారం నుంచి మూసివేశారు. తెలంగాణ సరిహద్దు (బోర్డర్‌)తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలతో సంబంధం ఉన్న అన్ని మార్గాలు దిగ్బంధించారు. సరిహద్దుల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. అత్యవసర వాహనాలు మినహా వేటినీ అనుమతించడం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజా, ప్రైవేట్‌ రవాణాను నిలిపివేసిన సంగతి తెల్సిందే. మూడు రోజుల క్రితమే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ప్రజా రవాణాను ఆపేసి సరిహద్దులు మూసివేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజారవాణా నిలిపివేసినప్పటికీ సొంత వాహనదారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించడంతో పోలీసులు మంగళవారం నుంచి మరిన్ని కఠిన చర్యలు చేపట్టారు.

- రాష్ట్ర సరిహద్దుల్లో, రహదారుల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆంక్షలు ధిక్కరించి వస్తున్న వాహనదారులకు కరోనా తీవ్రతను వివరిస్తూ పోలీసులు, రవాణా శాఖ అధికారులు నచ్చజెప్పడంతో వారు వెనుదిరుగుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.
- విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్‌ వద్ద ఆంక్షలు ఉన్నా ఓ వాహనదారుడు వేగంగా వచ్చి కానిస్టేబుల్‌ను ఢీకొట్టడంపై డీజీపీ సవాంగ్‌ సీరియస్‌గా స్పందించారు. జరిగిన ఘటనపై వివరాలు సేకరించాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. 
- కోదాడ, భద్రాచలం, నాగార్జున సాగర్‌లతో పాటు అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టుల వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువైపులా వాహనాలను నిలిపివేస్తున్నారు. 
- సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలనే ప్రతిపాదనను పోలీసులు పరిశీలిస్తున్నారు.
- పాలు, కూరగాయలు, ఔషధాలు వంటి నిత్యవసర సరుకులు సరఫరా చేసే వాహనాలనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు