కరోనా వైరస్‌: ఏపీ ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్‌ విడుదల

25 Mar, 2020 20:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా అనుమానిత కేసులను ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలందించాలని ప్రయివేట్‌ ఆస్పత్రులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఐసోలేషన్‌ వార్డుల కోసం అవసరమైతే ప్రయివేట్‌ ఆస్పత్రులను స్వాధీనం చేసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో ఈ విషయాలను వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని తెలిపారు.   

‘కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రానికి విదేశాల నుంచి 29వేల మంది వచ్చారు. మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించబోతున్నాం. ప్రత్యేకంగా నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయవాడలో ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ఆస్పత్రుల్లో 2వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఫీవర్‌ సర్వే ఉంటుంది. రాపిడ్‌ టెస్టింగ్‌ పరికరాలను తెప్పిస్తున్నాం. కరోనా పరీక్షల కోసం మరో మూడు ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాం. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. అన్ని జిల్లా కేంద్రాల్లో 200 ఐసోలేషన్‌ బెడ్‌లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించాం. ప్రతి నియోజకవర్గంలోనూ క్వారంటైన్‌ సెంటర్లు పెడుతున్నాం.

ఇప్పటివరకు 312 మంది శాంపిళ్లను పరీక్షలకు పంపించాం. 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది, 62 మంది రిపోర్టుల నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయి.  ఈ రోజు 13 మంది శాంపిల్స్‌ పరీక్షలకు పంపించాం. ఏపీలో విదేశాల నుంచి వచ్చిన 12,177 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచాము. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో భారీగా క్వారంటైన్ వార్డుల ఏర్పాటు. జిల్లా కేంద్రాలు, సబ్‌ డివిజన్‌ స్థాయిలో 17,837 ఐసోలేషన్ బెడ్లు అందుబాటులో ఉంచాం.   విశాఖ ఎయిర్‌పోర్టు, గంగవరం, క్రిష్ణపట్నం పోర్టులలో ప్రయాణికులకు స్క్రీనింగ్‌ ఉంటుంది’అని వైద్యఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు.  

చదవండి:
ఇంకా కోలుకోని కనికా కపూర్‌
చైనీస్‌ ఫుడ్‌ కావాలంటూ ఒక్కటే ఏడుపు!

మరిన్ని వార్తలు