ఏపీలో మొత్తం 133 రెడ్‌ జోన్లు

10 Apr, 2020 19:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 133 ప్రాంతాలను రెడ్‌జోన్లను ప్రకటించింది. అత్యధికంగా నెల్లూరులో 30, కర్నూలులో 22 ఈ క్లస్టర్లు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. 

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ పేషెంట్లు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ కస్టర్లుగా గుర్తించిన ప్రభుత్వం.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ (అదుపులో ఉంచడం) క్లస్టర్ల పరిధిలో గుర్తించిన రెడ్‌ జోన్, హాట్‌ స్పాట్లను పోలీస్‌ వలయంలో ఉంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాకుండా, బయటి వారు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా పోలీస్‌ గస్తీ ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ బయటకు రానీయడం లేదు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కేసుల నమోదుకూ వెనుకాడటం లేదు. 

కంటైన్మెంట్‌ క్లస్టర్లలో చర్యలిలా

  • పాజిటివ్‌ కేసులున్న ప్రాంతం చుట్టూ కిలోమీటరు మేర (హాట్‌ స్పాట్‌), దానికి మూడు కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌గా పరిగణిస్తున్నారు.
  • ఆ మొత్తం ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ క్లస్టర్‌గా ప్రకటించి.. దానికి చుట్టూ ఉన్న మార్గాలను మూసేసి 28 రోజులపాటు ఆంక్షల్ని కొనసాగిస్తున్నారు.
  • ప్రతి జోన్‌లో ఎస్‌ఐ ఇన్‌చార్జిగా ఆ ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి 10 నుంచి 20 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.  
  • ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వలంటీర్లు, నిర్దేశించిన ప్రభుత్వ ఉద్యోగుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు.
  • వాటి పరిధిలోని ప్రతి ఇంటినీ వలంటీర్లు, ఆశా వర్కర్లు సర్వే చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. 
  • ఆ ప్రాంతాల్లో భోజనం, ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేసేవారు ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన నిర్ధారణ పరీక్షలను బట్టి 5.72 శాతం పాజిటివ్‌ కేసులు నమోదైనట్టుగా తేలింది. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకూ 381 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ గుంటూరులో 7, తూర్పు గోదావరిలో 5, కర్నూలులో 2, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా నమోదు అయిన 16 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 381కి చేరింది. అలాగే ఆస్పత్రుల్లో 365మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. (అనంతపురం 2, కృష్ణా 2, గుంటూరు 1, కర్నూలు 1)

మరిన్ని వార్తలు