రాకపోకలు వద్దు

29 Mar, 2020 03:58 IST|Sakshi

లాక్‌ డౌన్‌ అతిక్రమిస్తే అధోగతే

ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే కరోనా ఆటకట్టు.. అందుకే దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌

రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు

లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారి సంక్షేమానికి మన సర్కార్‌ పెద్దపీట

ఏపీలోకి వచ్చేవారి కోసం క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు

14 రోజుల వైద్య పరిశీలన తర్వాత సొంతూళ్లకు వెళ్లడానికి అనుమతి

లాక్‌ డౌన్‌ పట్టించుకోకపోవడంతో ఇటలీ, స్పెయిన్‌లో మారణహోమం

వేరే రాష్ట్రాల నుంచి వైద్య పరీక్షలు లేకుండా వస్తే వారికి,వారి కుటుంబానికి, సమాజానికి పెను ప్రమాదమే

సాక్షి, అమరావతి: లాక్‌ డౌన్‌ను అపహాస్యం చేస్తే భారీ మూల్యం తప్పదని పాశ్చాత్య దేశాల్లో మోగుతోన్న మరణ మృదంగం స్పష్టం చేస్తోంది. స్వీయ నిర్బంధం (సెల్ఫ్‌ క్వారంటైన్‌), ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే ఉండటం (లాక్‌ డౌన్‌), సామాజిక దూరం (సోషల్‌ డిస్టెన్స్‌) పాటించడం ద్వారా మాత్రమే కోవిడ్‌–19 మహమ్మారి ఆటకట్టించవచ్చని డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తేల్చిచెప్పింది. ఈ వైరస్‌ పుట్టిన వుహాన్‌లో లాక్‌ డౌన్‌ను కచ్చితంగా అమలుచే యడం ద్వారా చైనాలో ఇతర ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా మన దేశంలోకి ఈ వైరస్‌ ప్రవేశిం చడంతో కేంద్రం ఆరోగ్య అత్యయికస్థితి (హెల్త్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించిన విషయం తెలిసిందే.

జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈనెల 22న దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను పాటించారు. ఆ మరుసటి రోజే దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడం ద్వారా కోవిడ్‌–19 వైరస్‌ విస్తరణను అరికట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. మన రాష్ట్రంలోనూ లాక్‌ డౌన్‌ను అమలు చేస్తున్నారు. జనాల రాకపోకల్ని నియంత్రించకపోతే వైరస్‌ అత్యంత ప్రమాదకరమైన రీతిలో విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రంలోకి పొరుగురాష్ట్రాల నుంచి వస్తున్న వారిని నేరుగా అనుమతించకుండా, హెల్త్‌ ప్రోటోకాల్‌ మేరకు మాత్రమే అనుమతిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారు ఎక్కడివారక్కడే ఉండేలా చూడాలని, వారికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఓ భాగం. 

ఇదెంత ప్రమాదం!
విదేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ఒక వ్యక్తి ఇటీవల పుట్టపర్తిలో పర్యటించాడు. అక్కడ పలువురిని కలిశాడు. వైద్య పరీక్షల్లో అతనికి పాజిటివ్‌గా తేలింది. దాంతో పుట్టపర్తిలో ఆ వ్యక్తి తిరిగిన ప్రాంతాలను రసాయనాలతో శుభ్రం చేశారు. అతన్ని కలిసిన వారిని క్వారంటైన్లో ఉంచారు.
రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల కర్నూలులోని పలు ప్రాంతాల్లో కలియతిరిగాడు. ఆ వ్యక్తికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆ వ్యక్తి తిరిగిన ప్రాంతాలను రసాయనాలతో శుభ్రం చేయాల్సి వచ్చింది.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వలస వెళ్లిన మన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు సొంతూళ్లకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించకుండా, క్వారంటైన్‌లో ఉంచకుండా నేరుగా వారి గ్రామాలకు పంపితే.. వారి కుటుంబ సభ్యులకే కాకుండా, రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

పటిష్టంగా లాక్‌ డౌన్‌ 
రాష్ట్రంలో కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తోంది. ఎక్కడ వారు అక్కడే ఉండేలా, ఇళ్లల్లో స్వీయ నిర్బందంలో ఉండేలా చర్యలు తీసుకుం టోంది. వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటా సర్వే చేసి.. ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసు కుంటూ ముందుజాగ్రత్తలు తీసుకుం టున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతు న్నారు. నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుతు న్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. 

ఆదమరిస్తే భారీ మూల్యం..
ఏపీకి సంబంధించిన ప్రజలు ఏఏ రాష్ట్రాలకు వలస వెళ్లారో.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి అక్కడే క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేయించి, ఆహారంతో పాటు వైద్య సౌకర్యాలను మన ప్రభుత్వం అందిస్తోంది. సొంతూళ్లకు వచ్చేందుకు బయలుదేరిన వారిని సరిహద్దుల్లోనే ఆపి క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. 14 రోజుల వైద్య పరిశీలన తర్వాత సొంతూళ్లకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు.
కర్ణాటకలోని మంగళూరులోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఏపీకి చెందిన 1,334 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారు సొంతూళ్లు వెళ్లడానికి నంగలి టోల్‌ ప్లాజా వద్దకు చేరుకున్నారు. ఇది తెలుసుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలు.. కోలార్‌ జిల్లా అధికార 

యంత్రాంగంతో చర్చించి 
అక్కడే క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. సరిహద్దుల్లో వేచి ఉన్న వారిని అక్కడికి  తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే.. తెలంగాణ నుంచి వస్తున్న వారిని సరి హద్దుల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి.. 14 రోజుల పాటు వైద్య పరిశీలనలో ఉంచాక వారి సొంతూళ్లకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటాన్ని వైద్య నిపుణులు తప్పుబడుతున్నారు. లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

కఠోర వాస్తవాలివీ..
ఇటలీలో కరోనా పాజిటివ్‌ తొలి కేసు జనవరి 29న నమోదైంది. అదే రోజు ఇటలీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ను ప్రకటించింది. లాక్‌ డౌన్‌ను హాలిడే ట్రిప్‌గా భావించిన ఆ దేశ ప్రజలు విందులు, వినోదాల్లో మునిగితేలారు. దాంతో కరోనా వైరస్‌ ఇప్పటి వరకూ 86,498 మందికి సోకింది. 9,134 మందిని బలి తీసుకుంది. 
స్పెయిన్‌లో తొలి పాజిటివ్‌ కేసు జనవరి 30న నమోదైంది. ఆ వెంటనే లాక్‌ డౌన్‌ ప్రకటన వచ్చింది. కానీ రాజధాని మ్యాడ్రిడ్‌లో వేలాది మంది యథేచ్ఛగా విహరించారు. దీంతో ఈ అంటువ్యాధి ఇప్పటిదాకా 72,248 మందికి సోకింది. 5,690 మంది ప్రాణాలను కబళించింది. 
అమెరికాలో తొలి పాజిటివ్‌ కేసు జనవరి 20న నమోదైంది. అయినా అమెరికా ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించలేదు. దాంతో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు (1,00,256) అమెరికాలో నమోదవడం గమనార్హం. ఇప్పటికే అగ్రరాజ్యంలో 1,704 మందిని మహమ్మారి పొట్టన పెట్టుకుంది.
ఇరాన్‌లో 2,517, ఫ్రాన్స్‌లో 1,995, యునైటెడ్‌ కింగ్‌ డమ్‌లో 759, నెదర్లాండ్స్‌లో 546, బెల్జియంలో 353, స్విట్జర్లాండ్‌లో 241 మందిని కరోనా బలి తీసుకుంది.
ఈ ఏడాది జనవరి 10న వుహాన్‌లో కోవిడ్‌–19 తొలి పాజిటివ్‌ కేసు బయటపడిన వెంటనే చైనా ఆ నగరాన్ని పూర్తిగా లాక్‌ డౌన్‌ చేసింది. దీంతో చైనాలోని మిగతా ప్రాంతాలకు విస్తరించలేదు. వుహాన్‌ పరిసర ప్రాంతాల్లో 81,394 కేసులు నమోదుకాగా.. 3,295 మంది మృత్యువాతపడ్డా రు. లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడం ద్వారా చైనా కరోనా విస్తరించకుండా చూడగలిగింది.

నిలువరించకపోతే చాలా కష్టం
ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అంత ర్రాష్ట్ర సరిహద్దులు మూసివేశారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని అనుమతిస్తే చాలా ప్రమాదం ఉంది. వారిని 14 రోజులు క్వారంటైన్‌కు పంపించి పరిశీలించిన తర్వాతే వదలాలి. లేదంటే వారికి పాజిటివ్‌ వస్తే వారినుంచి ఎంతమందికి వచ్చిందనేది గుర్తించడం చాలా కష్టం.     
– డాక్టర్‌ కె.ఎస్‌. జవహర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ

రాజస్తాన్‌ కేసు చూశాం కదా
అంతర్రాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌ చేయకుండా వదిలితే చాలా ప్రమాదం. రాజస్తాన్‌ నుంచి వచ్చిన కేసే ఇందుకు సాక్ష్యం. ఆయన వల్ల ఎంతమందికి ఈ వైరస్‌ విస్తరించిందో గుర్తించడానికి చాలా కష్టపడుతున్న విషయం తెలిసిందే. మిగతా వారికి వైరస్‌ వ్యాపించకూడదు అంటే పూర్తిగా లాక్‌డౌన్‌ను పాటించడమే మార్గం.
– డాక్టర్‌ కె.వెంకటేష్, వైద్యవిద్య సంచాలకులు

మరిన్ని వార్తలు