తడలో కరోనా కలకలం

30 May, 2020 12:54 IST|Sakshi
తడ: గుమ్మిడిపూండి అరుంధతీయవాడలో పారిశుధ్య పనులు చేస్తున్న సిబ్బంది

నెల్లూరు, తడ: తడ మండలంలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఎంపీడీఓ జి.శివయ్య సమాచారం మేరకు తడకండ్రిగ పంచాయతీ పరిధిలోని గుమ్మిడిపూండి అరుంధతీయవాడకు చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం, కాళంగి గ్రామానికి చెందిన ఓ యువకుడు కొద్దిరోజుల క్రితం వచ్చాడు. మిత్రులతో గడిపి తిరిగి గ్రామానికి వెళ్లిన అనంతరం అనారోగ్యానికి గురికావడంతో అక్కడ పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతని సన్నిహితుల వివరాలు సేకరించిన సమయంలో గుమ్మిడిపూండి లింకులు తెలిసి నాలుగు రోజుల క్రితం గ్రామంలో పరీక్షలు నిర్వహించారు. ట్రూనాట్‌ పరీక్షల్లో నలుగురు యువకులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని నెల్లూరు ఐసొలేషన్‌కి తరలించారు. వీరి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపారు. ఈ ప్రాంతంలో పారిశుధ్య పనులు ముమ్మరం చేసి బ్లీచింగ్‌ చల్లారు. 

గోపాల్‌రెడ్డిపాళెంలోనూ..
సూళ్లూరుపేట రూరల్‌: సూళ్లూరుపేట మండలంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తోంది. నిన్నటివరకు పట్టణాలకే పరిమితమైన కరోనా పాజిటివ్‌ కేసులు నేడు గ్రామాలకు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో గ్రామీణులు కూడా భయందోళన చెందుతున్నారు. శుక్రవారం సూళ్లూరుపేట మండలం గోపాలరెడ్డిపాళెం గ్రామంలో కరోనా కలకలం రేగింది. సూళ్లూరుపేట పట్టణంలోని మహదేవయ్యనగర్‌ ప్రాంతం కంటైన్మెంట్‌ జోన్‌గా ఉంది. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ కుంటుంబంలోని అందరికీ ఇటీవల కరోనా టెస్టులు చేశారు. ఆ ఇంట్లో  తల్లీబిడ్డలను తప్ప మిగిలిన అందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఆ తల్లీబిడ్డలను సొంత గ్రామమైన గోపాల్‌రెడ్డిపాళెంలో అమ్మగారి ఇంట్లో వదిలివెళ్లారు. ప్రస్తుతం ఆ మహిళకు పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో తల్లీబిడ్డలను నెల్లూరులోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎంపీడీఓ నర్మద, సచివాలయ సిబ్బంది, ఏఎన్‌ఎంలు గ్రామానికి చేరుకున్నారు. అయితే ఇది మహదేవయ్యనగర్‌ ప్రాంతానికి చెందిన కేసు అని ఎంపీడీఓ తేల్చారు. కానీ గ్రామంలో ఆ మహిళ సెకండరీ కాంట్రాక్ట్‌లో 50 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  వీరందరికీ శనివారం కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు