తెలుగు రాష్ట్రాల సరిహద్దులు మూసివేత

24 Mar, 2020 04:46 IST|Sakshi
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌ ప్లాజా నిర్మానుష్యంగా మారిన దృశ్యం

చెక్‌పోస్టుల వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు

అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి

డిపోల నుంచి కదలని బస్సులు

సరుకు రవాణా వాహనాలకు అనుమతివ్వాలని లారీ యజమానుల సంఘం వినతి

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ విస్తరణ నిరోధక చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దులను మూసివేశారు. అత్యవసర వాహనాలు మినహా వేటినీ అనుమతించడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజా, ప్రైవేట్‌ రవాణాను ఇప్పటికే నిలిపివేశారు. మూడు రోజుల క్రితమే తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేశారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న గరికపాడు చెక్‌పోస్టు వద్ద సోమవారం భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని రవాణా, పోలీస్‌ అధికారులు తేల్చి చెప్పడంతో వాహనదారులు వెనుదిరిగారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో పోలీసులు, రవాణా అధికారులు, వైద్య సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదల్లేదు. అత్యవసర సర్వీసుల కోసం ఆర్టీసీ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఆటోలు, క్యాబ్‌లను నిలిపివేసిన రవాణా శాఖ ఆస్పత్రులకు వెళ్లేందుకు మాత్రం మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

- లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సొంత వాహనాల్లో బయలుదేరిన వారిని చెక్‌ పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  
- కోదాడ, భద్రాచలం, నాగార్జున సాగర్, అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టుల వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువైపులా వాహనాలను నిలిపివేస్తున్నారు. కర్ణాట క, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాల ను అనుమతించడం లేదు. కోదాడ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  
- పాలు, కూరగాయలు, ఔషధాల వాహనాలను మాత్రమే రాష్ట్రం నుంచి బయటకు వెళ్లనిస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 
- సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని లారీ యజమానుల సంఘం కోరింది. 

మరిన్ని వార్తలు