-

ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుకు సీఎం జగన్‌ ఆదేశం

5 Apr, 2020 16:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలతో ఎవరు వచ్చినా చికిత్స అందించాలన్నారు.  కరోనా నియంత్రణపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవాళ్లు, వారు కలిసిన వ్యక్తులకు త్వరగా పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ కరోనా టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని, ఇప్పుడున్న ల్యాబ్ ల సామర్థ్యం పెంచాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి ఆరోగ్య సర్వే నిరంతరం జరుగుతుండాలని ఆదేశించారు. కరోనా వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలు పాటించేలా చూడాలని తెలిపారు. ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం మార్గదర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. 

మరిన్ని వార్తలు