మరింత చురుగ్గా టాస్క్‌ఫోర్స్‌లు

1 Apr, 2020 03:00 IST|Sakshi

కరోనా వైరస్‌ కట్టడిలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌లకూ భాగస్వామ్యం

ఖాళీలను వెంటనే భర్తీ చేయండి..వారినీ వినియోగించుకోండి

సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష

పట్టణ ప్రాంతాల్లో ప్రతీ కుటుంబం ఆరోగ్య పరిస్థితిపై నిరంతరాయంగా సర్వే

కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌ చేయాల్సిందే

పటిష్టంగా లాక్‌డౌన్‌.. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోండి

తాత్కాలిక పరిష్కారంగా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు

రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో జనతా మార్కెట్ల ఆలోచన 

ఆక్వా రైతులు, అనుబంధ రంగాలకు ఊతం

వివిధ రూపాల్లో సహాయం చేయాలనుకునేవారు జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను సంప్రదించాలి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారిని వినియోగించుకోవాలి. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలయ్యేలా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. 

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కట్టడికి జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్సులు మరింత చురుగ్గా పని చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంత్రులు తప్పనిసరిగా క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలని చెప్పారు. కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్సులు మరింత సమర్థవంతంగా పని చేయడానికి మార్కెట్‌ యార్డుల చైర్మన్‌లనూ అందులో భాగస్వాములు చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న మిగతా మార్కెట్‌ యార్డుల చైర్మన్‌ పోస్టులను భర్తీ చేసి, వారినీ టాస్క్‌ఫోర్సుల్లో వినియోగించుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వే సాగుతున్న తీరును, వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు, నిత్యావసరాలు, లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. అనంతరం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 

ఇంటింటి సర్వే రోజూ కొనసాగాలి
పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే ప్రతి రోజూ నిరంతరాయంగా కొనసాగాలి. ఇందుకోసం ఏర్పాటైన బృందాలు రోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలి. కరోనా లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆరోగ్య వివరాలు అందించాలి. వాళ్ల కోసం, ప్రజల కోసమే సర్వే జరుగుతోందని, అందరూ సహకరించాలని ప్రజలకు అవగాహన కలిగించాలి. చదువుకున్న వారు, అవగాహన ఉన్న వారు నేరుగా వెబ్‌ ద్వారా సొంతంగా తమ ఆరోగ్య పరిస్థితులపై రిపోర్టు చేసే విషయమై అవగాహన కల్పించాలి. లేదా కాల్‌ సెంటర్‌ ద్వారా వివరాలు తెలియజేయాలని వివరించాలి. షెల్టర్లలో ఉన్న వారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే క్వారంటైన్‌ చేయాలి. 
పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు.. మిగిలిన ప్రాంతాల్లో 6 గంటల నుంచి 1 గంట వరకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ సమయంలో ఎక్కడా నిత్యావసరాల కొనుగోలు కోసం జనం గుమిగూడకుండా చూడాలి. భౌతిక దూరం తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలి.
డోర్‌ డెలివరీని ప్రోత్సహించాలి
పట్టణ ప్రాంతాల్లో రైతు బజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై మరింతగా దృష్టి పెట్టాలి. సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్ల ద్వారా డోర్‌ డెలివరీని ప్రోత్సహించాలి. ప్రతి దుకాణం ఎదుట ధరల పట్టికను ప్రదర్శించి, అది అమలయ్యేలా చూడాలి. ఉన్నతాధికారులు దీనిని పర్యవేక్షించాలి.   
తాత్కాలిక పరిష్కారంగా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. అరటి, టమాటా లాంటి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. నిల్వ చేయలేని పంటల విషయంలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ మేరకు తక్షణమే సంబంధిత అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
లాక్‌డౌన్‌ సమయంలో అన్ని దుకాణాల వద్ద పండ్లు అమ్ముకునే అవకాశం కల్పించాలి. దీనివల్ల రిటైల్‌ వ్యాపారం పెరిగి, రైతులకు కొంతైనా మేలు జరుగుతుంది. ఇది వెంటనే అమలు కావాలి. 
క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌   

శాశ్వత పరిష్కారాలపై దృష్టి
రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో జనతా మార్కెట్‌ల ఏర్పాటు చేయటంపై ఆలోచించాలి. గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా డిమాండ్‌కు తగినట్టుగా ఈ మార్కెట్లు ఏర్పాటు చేసే విషయమై కార్యాచరణ రూపొందించాలి. 
ఆ మేరకు డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను నెలకొల్పే దిశగా అడుగులు ముందుకు వేయాలి. గతంలో ఈ తరహా కార్యక్రమాలను పరిశీలించి మంచి విధానం రూపొందించాలి.

ఆక్వా రంగంపై సీఎం ఆరా
ఆక్వా రంగ అనుబంధ పరిశ్రమల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ సిబ్బందితో పని చేయించాలి. ( 69 ప్రాసెసింగ్‌ యూనిట్లలో 41 చోట్ల పని ప్రారంభమైందని, అమెరికా, చైనాలకు ఎగుమతి మొదలైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విశాఖపట్నం పోర్టు నుంచి 13, కాకినాడ పోర్ట్‌ నుంచి 4 కంటైనర్ల ఎగుమతి.)  
ప్రాసెసింగ్‌ కేంద్రాల్లో వర్కర్స్‌ పాసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. వారి సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలి. 
ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్, తదితరులు పాల్గొన్నారు. 

ఆరోగ్య శ్రీ కింద పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాం. అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలి. 

మరిన్ని వార్తలు