ఉద్యాన పంటల రైతులను ఆదుకోండి

2 Apr, 2020 04:58 IST|Sakshi

ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖాధికారులతో సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నిరోధానికి లాక్‌ డౌన్‌ విధించిన సమయంలో పండ్లు, కూరగాయల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల స్థితిగతులు, ధరలు, రవాణా సదుపాయాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. టమాటా, అరటి వంటి పంటల రైతులను ఆదుకోవాలన్నారు. అవసరమైతే మార్కెటింగ్‌ శాఖే రంగంలోకి దిగి కనీస మద్దతు ధరకు టమాటాను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని ఆదేశించారు.

సీఎం సూచనతో వెంటనే చర్యలు
► ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం ప్రత్యేకంగా సమావేశమైన ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖాధికారులు కనీస మద్దతు ధరతో టమాటాను కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశారు. 
► ప్రతి రోజూ 40–50 టన్నుల టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లకు పంపాలని నిర్ణయించినట్టు ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌధురీ తెలిపారు. ఇలా చేయడం వల్ల మార్కెట్‌ ధరను నియంత్రించవచ్చన్నారు. 
► కూరలకు పనికి వచ్చే రకాన్నే కాకుండా ప్రాసెసింగ్‌కు (శుద్ధి చేసి నిల్వ చేసుకునే విధంగా) పనికి వచ్చే టమాటా రకాలను కూడా సాగు చేయమని రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. టమాటాకు అదనపు విలువ జోడించేలా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్టు వివరించారు.

80 టన్నుల టమాటా కొన్నాం: మంత్రి కన్నబాబు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచన మేరకు బుధవారం ఒక్క రోజే మదనపల్లిలో 40 టన్నులు, పుంగనూరులో 10, మొలకలచెరువులో 20, ఇతర ప్రాంతాల్లో 10 టన్నులు (మొత్తం 80 టన్నులు) కొనుగోలు చేశాం. ఇతర రాష్ట్రాలకు పంపడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. అరటి రైతులకు కూడా మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.

>
మరిన్ని వార్తలు