సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్‌

31 Mar, 2020 15:34 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : కరోనా లక్షణాలు ఉన్న వారు నిర్భయంగా ముందుకొచ్చి ఆరోగ్య వివరాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల వివరాలను, ప్రార్థనల కోసం ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లిన వారి వివరాలను అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. అంతేకాకుండా కొత్తగా నమోదైన కేసుల్లో చాలా మంది ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్నవారేనని వివరించారు. 

కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌
ఢిల్లీ వెళ్లిన వారు, కాంటాక్ట్‌లో ఉన్నవారు ముందుకొచ్చి చికిత్స తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. ఢిల్లీ వెళ్లిన వారిని గుర్తించి పరీక్షలు చేసి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం అర్భన్‌ ప్రాంతాల్లో కరోనా నియంత్రణపై పూర్తి సమాచారాన్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ముందుకొచ్చి ఆరోగ్య వివరాలు అందించాలని, లేదంటే వారి కుటుంబసభ్యులకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. షెల్టర్లలో ఉన్నవారికి కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌ చేయాలని సీఎం ఆదేశించారు. 

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దుకాణాల ముందు ధరల పట్టికను తప్పకుండా ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేసే విధంగా అధికారులకు మార్గనిర్దేశకాలు ఇచ్చాం. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అరటి, టమాట రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ని​ల్వచేయలేని పంటల విషయంలో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. రైతు భరోసా కేంద్రాల ఆధ్వ​ర్యంలో జనతా మర్కెట్‌లపై ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి. ఆక్వారైతులు, ఆక్వా రంగ అనుబంధ పరిశ్రమలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  69 ప్రాసెసింగ్‌ యూనిట్లలో 41 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. అమెరికా, చైనా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

చదవండి:
కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి
హ్యాట్సాఫ్‌ డాక్టర్‌ నరేంద్ర

>
మరిన్ని వార్తలు