ఆసుపత్రులకు నిరంతర విద్యుత్తు

30 Mar, 2020 04:25 IST|Sakshi

క్షణం కూడా కరెంట్‌ ఆగకూడదు

పంపిణీ, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

ఉన్నతాధికారులతో మంత్రి బాలినేని సమీక్ష

సాక్షి, అమరావతి: ఆసుపత్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగరాదని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. కరోనా వైరస్‌ బాధితులకు వైద్య సేవల్లో సమస్యలు తలెత్తకుండా విద్యుత్‌ సరఫరా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజా పరిస్థితిపై విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు, జెన్‌కో ఎండీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు, పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఏ.చంద్రశేఖర్‌రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. 

► విద్యుత్‌ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ఫీడర్లు మొదలుకొని అన్నిటిని పర్యవేక్షిస్తున్న అధికారులు ఎక్కడైనా సమస్య తలెత్తితే తక్షణమే అప్రమత్తమయ్యేలా చర్యలు చేపట్టారు. 
ట్రాన్స్‌ఫార్మర్లను సిబ్బంది నిరంతరం పరిశీలిస్తున్నారు.
► రోగుల తాకిడి ఎక్కువగా ఉండేచోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ ఉపకరణాలు, సిబ్బందిని తయారుగా ఉంచారు.
లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 196 – 200 మిలియన్‌ యూనిట్ల వరకు ఉండగా ప్రస్తుతం ఇది 154 ఎంయూలకు పడిపోయింది. అయితే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం తగ్గినా గృహ విద్యుత్‌కు మాత్రం డిమాండ్‌ పెరుగుతోంది.
► విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడంతో రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్‌టీపీపీ)లో ఐదు యూనిట్లు, ఎన్టీటీపీఎస్‌ లో నాలుగు యూనిట్లు, ఎస్‌డీఎస్‌టీపీఎస్‌లో ఒక యూనిట్, కుడిగిలో ఒక యూనిట్, వల్లూరులో 40 మెగావాట్‌లతో కలిపి మొత్తం 3,370 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేశారు. 
► థర్మల్‌ విద్యుదుత్పత్తిని తగ్గించడంతో వివిధ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచు కోవడంపై ఏపీ జెన్‌కో దృష్టి పెట్టింది. మొత్తం 14,89,703 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అందుబాటులో ఉంది. ఇది 20 రోజులకు సరిపోతుంది. 
► బహిరంగ మార్కెట్లలో ప్రస్తుతం విద్యుత్‌ అమ్మకం ధరలు పడిపోయాయి. వాణి జ్య, పారిశ్రామిక డిమాండ్‌ బాగా తగ్గడం తో గతవారం సగటున ఒక యూనిట్‌ ధర రూ.2 నుంచి రూ.2.50 వరకు ఉంది. సొంతంగా ఉత్పత్తి కన్నా బహిరంగ మార్కెట్‌లోనే విద్యుత్‌ తక్కువ ధరకు లభిస్తుండడంతో డిస్కమ్‌లు అటు వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల విద్యుత్‌ కొనుగోలు వ్యయం తగ్గడం తోపాటు డిస్కమ్‌లపై ఆర్థిక భారం కొంతమేర తగ్గే అవకాశముంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా