అనంతపురం ఉలికిపాటు

9 Apr, 2020 07:28 IST|Sakshi

ఒకే రోజు ఏడుగురికి కరోనా పాజిటివ్‌  

13కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య 

బాధితుల్లో ఇద్దరు వైద్యులు,     ఇద్దరు స్టాఫ్‌నర్సులు  

భయాందోళనలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది 

కరోనాతో బుధవారం మరొకరు మృతి

రెండుకు చేరిన మృతుల సంఖ్య  

సాక్షి, అనంతపురం : కరోనా పాజిటివ్‌ కేసులతో అనంత ఉలిక్కిపడింది. ఒకే రోజు ఏడు కేసులు నమోదు కావడం, అందులో ఒకరు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 13 కేసులు నమోదు కాగా, అందులో ఇద్దరు మృతి చెందారు. ఈ మేరకు కలెక్టర్‌ గంధం చంద్రుడు కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. కరోనా బారిన పడిన వారిలో సర్వజనాస్పత్రిలో రోగులకు సేవలందించిన ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్‌నర్సులు ఉండటంతో ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వైద్యులు, నర్సులు ఆస్పత్రిలోని వివిధ ప్రాంతాల్లో తిరగడంతో పాటు తోటి సిబ్బంది, నర్సింగ్, వైద్య విద్యార్థులతో పని చేశారు. దీంతో ఆరోగ్యశాఖాధికారులు వారితో సన్నిహితంగా ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. సుమారు 40 మందికి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  

నిర్లక్ష్యం వల్లే పెరిగిన కేసులు 
హిందూపురానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి ఈ నెల 1వ తేదీ వేకువజామున కరోనా లక్షణాలతో సర్వజనాస్పత్రికి రాగా.. అతని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడంలో ఆస్పత్రి వైద్యులు విఫలమయ్యారు. పేషెంట్‌ను నేరుగా చెస్ట్‌ వార్డుకు పంపారు. మరుసటి రోజు ఐసోలేషన్‌ వార్డుకు మార్చారు. అదే రోజు అక్యూట్‌ మెడికల్‌ కేర్, ఆ తర్వాత కోవిడ్‌ ఐసీయూకు షిఫ్ట్‌ చేశారు. ఆ తర్వాత అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ తేలింది. ఈ క్రమంలోనే ఈ నెల 4న అతను మృతి చెందాడు. ఈ వ్యక్తికి చికిత్స చేసిన సీనియర్‌ రెసిడెంట్‌(29), హౌస్‌సర్జన్‌(2కే15 బ్యాచ్‌), రెగ్యులర్‌ స్టాఫ్‌నర్సు(45), కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్స్‌(29), మృతుడి తల్లి (80), మృతుని కుమారుడు(29), అతన్ని హిందూపురం నుంచి అనంతపురానికి తీసుకువచ్చిన అంబులెన్స్‌ డ్రైవర్‌ కరోనా బారిన పడ్డారు.

ఆస్పత్రి వైద్యుల చిన్నపాటి నిర్లక్ష్యంతో ఇప్పుడు ఏడుగురు వైరస్‌తో పోరాడుతున్నారు. అలాగే ఈ నెల 7న సర్వజనాస్పత్రిలో కళ్యాణదుర్గం మణిరేవు ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందగా.. అతను కూడా హిందూపురం ప్రాంత వాసి ఉన్న వార్డులో ఉండటం వల్లే వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. వైద్యులు ప్రారంభంలోనే ఇతన్ని ఐసోలేషన్‌కు పంపి, పరీక్ష చేసి ఉంటే ఇంతమంది కరోనా బారిన పడే వారు కాదని సర్వజనాస్పత్రి సిబ్బందే అభిప్రాయపడుతున్నారు. 

ఎవరిది పాపం.. ఏమిటీ శాపం 
కరోనా నివారణకు జిల్లా యంత్రాంగం క్షణం తీరిక లేకుండా పనిచేస్తోంది. అయినా అక్కడక్కడా కొన్ని లోపాలు కనిస్తున్నాయి. అందువల్లే రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా లక్షణాలపై నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్యులే.. దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. అందువల్లే హిందూపురం వాసి విషయంలో నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా ఆస్పత్రిలోని వైద్యులు, నర్సులు కరోనా బారిన పడ్డారు. ఇక హిందూపురం వాసితో కలిసి వార్డులో ఉన్న కళ్యాణదుర్గం వాసి విషయంలోనూ వైద్యాధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. హిందూపురం వాసి కరోనాతో మృతి చెందగానే కళ్యాణదుర్గం నుంచి వచ్చిన వృద్ధునికి సకాలంలో త్రోట్‌ స్వాప్‌ తీసి పరీక్షలు చేయించలేదు.

చాలా మామూలు కేసుగా భావించి పదుల సంఖ్యలో సిబ్బందితో సేవలందించారు. ఆ తర్వాత అతనికి కరోనా పరీక్ష చేసినా ఆ రిపోర్టు రాకముందే అతను మృతి చెందగా ఎలాంటి చర్యలు లేకుండా మృతదేహాన్ని అప్పగించేశారు. ఆ తర్వాత అతనికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆస్పత్రి వైద్యులు చేసిన తప్పునకు సదరు వ్యక్తి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న వారందరినీ ఇప్పుడు క్వారంటైన్‌లో ఉంచి కరోనా పరీక్షలు చేయాల్సి వస్తోంది. మరోవైపు అతనికి వైద్య సేవలందించిన వైద్యులు, సిబ్బందిలోనూ ఆందోళన నెలకొంది. ఇక కరోనా ఐసీయూలో సేవలందించిన క్లాస్‌ 4 సిబ్బందికి నేటికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించపోవడంపై చూస్తే వారి పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోంది.  

వివరాలు పక్కాగా సేకరించండి 
అనంతపురం అర్బన్‌: కరోనా పాజిటివ్‌ కేసులతో సన్నిహితంగా మెలిగిన వారి వివరాల సేకరణకు కంటైన్మెంట్‌ స్ట్రాటజీ అమలు చేయాలనీ, ఇందుకోసం ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో జేసీ డిల్లీరావు, ఎస్సీ సత్యయేసుబాబుతో కలిసి అధికారులతో సమీక్షించారు. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లో ఒక సీనియర్‌ వైద్యాధికారి, ఇద్దరు ఎంపీహెచ్‌ఓలు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్, ఒక వీఆర్‌ఓ ఉంటారని, ఒక్కో కేసుకు ఒక టీమ్‌ ఏర్పాటు చేశామని వీరంతా పాజిటివ్‌ కేసులకు సంబంధించిన వివరాలు సూక్ష్మస్థాయిలో పరిశీలించి సేకరించాలన్నారు.  
 

మరిన్ని వార్తలు