కరోనాతో ఢిల్లీ వాసి మృతి 

28 Apr, 2020 08:44 IST|Sakshi

జిల్లాలో మూడుకు చేరిన మరణాలు

నెల్లూరు(అర్బన్‌): కరోనా పాజిటివ్‌ సోకి నగరంలోని నారాయణ కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సోమవారం మృతిచెందాడు. అధికారుల సమాచారం మేరకు.. ఢిల్లీకి చెందిన 9 మంది వ్యక్తులు మత ప్రార్థనల కోసం రెండునెలల క్రితం నెల్లూరుకు వచ్చారు. వీరంతా ఒకే ప్రార్థనా మందిరంలోనే ఉండే వారు. ఢిల్లీ మర్కజ్‌కి వెళ్లి వచ్చిన వారు సైతం ఈ వ్యక్తులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా వైద్యశాఖాధికారులు వారిని ఈనెల 16న ఐసోలేషన్‌ వార్డులోకి మార్చారు. పరీక్షలు చేయగా 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఒక వ్యక్తి ఇంతకుముందే పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తాజాగా మరో వ్యక్తి చనిపోయాడు. ఇతనికి ఆస్తమా కూడా ఉంది. ఈ విషయాన్ని జిల్లా అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే నగరానికి చెందిన డాక్టర్, ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే.

మరో మూడు..
సోమవారం సాయంత్రానికి జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో నెల్లూరులోని కోటమిట్టలో రెండు, కొండాపురం మండలం పార్లపల్లిలో ఒకటి ఉన్నాయి. కొండాపురంలో ఇదే తొలి కేసు కావడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం జిల్లాలో 82 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

పార్లపల్లిని పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌ 
కొండాపురం: మండలంలోని పార్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ రావడంతో సోమవారం కావలి సబ్‌ కలెక్టర్‌ శ్రీధర్, కావలి డీఎస్పీ ప్రసాద్‌ గ్రామంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామం నుంచి ఎవరినీ బయటకు పోనివ్వద్దని, అలాగే ఇతరులను అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలను రెవెన్యూ సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ అందించాలన్నారు. కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ నుంచి కొండాపురం, కలిగిరి మండలాలకు చెందిన 20 మంది ఆటోల్లో వచ్చారని ఎస్సై రవిబాబు సమాచారం ఇవ్వడంతో వారిని కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. అనంతరం వారిని క్వారంటైన్‌కు తరలించామన్నారు. 

మరిన్ని వార్తలు