మేమున్నామని.. మీకేం కాదని..!

4 Apr, 2020 03:49 IST|Sakshi

కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న వేళ.. పేదలు, అనాథలు, యాచకులు, అభాగ్యులు, రోగులు ఆకలితో అలమటిస్తున్న వేళ.. మేమున్నామంటూ.. మీకేం కాదంటూ వారికి భరోసానిస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, వివిధ అసోసియేషన్లు, చారిటబుల్‌ ట్రస్టులు కూడా ముందుకొస్తున్నాయి. తమకు చేతనైనంత సహాయం చేస్తూ కష్టకాలంలో తమ పెద్ద మనసును చాటుకుంటున్నాయి. కొంతమంది ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని సరఫరా చేస్తుండగా, మరికొందరు ఇంటింటికీ తిరుగుతూ బియ్యం, కూరగాయలు, ఉల్లిపాయలు, వంట నూనె, తదితర నిత్యావసరాలను అందిçస్తూ కష్టకాలంలో తోటివారికి అండగా నిలుస్తున్నారు.     
– సాక్షి, నెట్‌వర్క్‌

చిన్న వయసు.. పెద్ద మనసు
విజయనగరంలో అభ్యాగుల కడుపునింపుతోంది.. సిరి సహస్ర. వయసులో చిన్నదైనా పెద్ద మనసుతో రోజూ దాదాపు 300కుపైగా ఆహార ప్యాకెట్లను, శానిటైజర్లను, మాస్కులను అందిస్తోంది. కోవిడ్‌–19కు భయపడి బయటకు రావడానికే అందరూ భయపడుతుంటే సిరి సహస్ర మాత్రం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి దగ్గరకు కూడా వెళ్లి ఆహారం అందజేస్తూ ప్రశంసలు పొందుతోంది.

800 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేటకు చెందిన అర్జున్‌బాబు శుక్రవారం 800 కుటుంబాలకు రూ.200 విలువ చేసే నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. తన తండ్రి పేరుతో ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున బియ్యం, వంట నూనె, గోధుమ పిండి, అర కిలో పంచదార, డెటాల్‌ సబ్బు, రెండు మాస్క్‌లను ఇంటింటికీ వెళ్లి అందించారు. ఇందుకోసం సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. 

బాలయ్యా.. బతికిస్తున్నావయ్యా..!
చిత్తూరు నగరం తూర్పు (తాలూకా) సీఐగా పనిచేస్తున్న బాలయ్య తన ఉదార స్వభావాన్ని చాటుకుంటూ పోలీసు శాఖకు మంచిపేరు తీసుకొస్తున్నారు. అభాగ్యులు, అనాథలకు గత వారం రోజులుగా అన్నదానం చేస్తున్నారు. రోజూ మధ్యాహ్నం దాదాపు వెయ్యి మందికి సరిపడే భోజనాన్ని తన సొంత ఖర్చులతో తయారుచేయిస్తున్నారు. ఓ వాహనంలో భోజనాలు ఉంచుకుని నగరమంతా తిరుగుతూ ఆకలి తీరుస్తున్నారు. 

ధాన్యం విరాళమిచ్చిన రైతులు
లాక్‌డౌన్‌తో ఉపాధి, కూలీ పనులు పొగొట్టుకున్న పేదలు, బడుగు వర్గాలను ఆదుకునేందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల రైతులు ముందుకు వచ్చారు. 150 పుట్ల వరి ధాన్యాన్ని సేకరించి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి విరాళంగా అందజేశారు. వరి ధాన్యం, నగదు విరాళాల విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. 

ఆకలి తీరుస్తున్న ‘అమ్మ’ ట్రస్ట్‌ 
గుంటూరు నగరంలో ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న కూలీలు, యాచకులకు, నగరపాలక సంస్థ నైట్‌ షెల్టర్స్‌లో ఉండే వారికి అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిత్యం రెండు పూటలా భోజనం అందిస్తోంది. అలాగే జలగం రామారావు ఉన్నత పాఠశాలలో ఉన్న 320 మంది నిరాశ్రయులకు శుక్రవారం మూడు పూటలా భోజనం అందజేశారు. 

అన్నార్తులకు అండగా..    
కర్నూలు జిల్లా నంద్యాలలో కారు రవికుమార్, ఆరెల్‌ ఆంథోని, కుమార్, సర్వ్‌నీడీ స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్‌ జాన్, తదితరులు నిరాశ్రయులకు, అన్నార్తులకు అన్నదానం చేస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. అంతేకాకుండా బ్యాంక్‌ పరీక్షల కోచింగ్‌ కోసం నంద్యాల వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన 400 మంది విద్యార్థులకు అల్పాహారంతోపాటు రెండుపూటలా అన్నదానం చేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు