చేతనైనంత చేయూత

28 Mar, 2020 04:58 IST|Sakshi
నిజంగా అన్నపూర్ణమ్మే.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గ ఆలయం తరఫున పేదలకు రోజూ ఆహారం అందజేస్తున్నారు. రోజూ రెండు వేల వంతున కదంబం (అన్ని రకాల కూరగాయలతో వండే వంటకం), దద్దోజనం ప్యాకెట్లు పేదలకు పంపిణీ చేస్తున్నారు.

సాక్షి, నెట్‌వర్క్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ దేశం మొత్తం లాక్‌ డౌన్‌లోకి వెళ్లిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పేదలు, వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వారికి మేమున్నామంటూ దాతలు సాయం చేస్తున్నారు. ఆపత్కాలంలో పేదలను ఆదుకుంటున్నారు. 

వలస కూలీలకు ఆపన్న హస్తం
చెన్నైలో పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీలు కాలినడకన స్వస్థలానికి బయల్దేరారు. శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం సరిహద్దు గ్రామం పన్నంగాడు వద్ద వారికి సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వరరెడ్డి, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం తిరిగి చెన్నైకి పంపించారు. 

పేదలకు నిత్యావసరాల పంపిణీ
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిపాలెంలో వైఎస్సార్‌సీపీ రాజోలు నియోజకవర్గ యూత్‌ ప్రతినిధి నల్లి సుథీర్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఎస్సై పి.సురేష్‌ పంపిణీ చేశారు. అంతర్వేది దేవస్థానంలో భారతరత్న యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నారైల సహకారంతో పది కేజీలు చొప్పున బియ్యం, కాయగూరలు 70 పేద కుటుంబాలకు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలంకలో రేపూరి ఏసు నరసింహారావు ఒక్కో కుటుంబానికీ కేజీ చొప్పున 2 వేల కుటుంబాలకు ఉల్లిపాయలు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులకు నగదు, బియ్యం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం పట్టణ వైఎస్సార్‌సీపీ నాయకులు, కొందరు ఉద్యోగులు కలసి పారిశుద్ధ్య కార్మికులకు రూ.500 చొప్పున నగదు, 20 కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పు, కిలో వంటనూనె అందించారు. 

మన కోసం పని చేస్తున్న వారికి..
కడప జిల్లా రాయచోటిలో పోలీసులకు లయన్స్‌క్లబ్‌ రాయచోటి టౌన్‌ సభ్యులు వాటర్‌బాటిల్స్, ఎనర్జీ వాల్‌నట్స్ల్‌ పంపిణీ చేశారు. కడప నగరం 25వ వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ ఆసిఫుల్లాఖాన్‌ ఆధ్వర్యంలో పోలీసులకు అన్నం పొట్లాలు, వాటర్‌ బాటిల్స్‌ అందచేశారు.

పోలీసులకు భోజనం ప్యాకెట్లు
విజయనగరంలో ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, ఆస్పత్రి సిబ్బందికి, నగరంలోని అనాథలకు మజ్జిసిరి సహస్ర శుక్రవారం మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు అందజేశారు. 

మరిన్ని వార్తలు