ఫేక్‌ న్యూస్‌పై ఫ్యాక్ట్‌ చెక్‌

19 Apr, 2020 04:56 IST|Sakshi

కరోనాపై వదంతులు, తప్పుడు ప్రచారాలను నిగ్గు తేలుస్తున్న సీఐడీ 

ఫ్యాక్ట్‌ చెక్‌ ప్రత్యేక సెల్‌ 9071666667కు విశేష స్పందన 

రెండు రోజుల్లోనే ప్రజల నుంచి 4,200 విచారణలు 

సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌లోని ఫేక్‌ న్యూస్, ఫేక్‌ చిత్రాలపై ఫిర్యాదులు 

ఫేక్‌ పోస్టింగ్‌లపై ప్రజలకు అవగాహన కల్పించేలా సీఐడీ వెబ్‌సైట్‌లో వాస్తవాలు 

విద్వేషపూరిత చర్యలపై కొరఢా ఝుళిపిస్తున్న ఏపీ సీఐడీ 

సాక్షి, అమరావతి: కరోనాకు సంబంధించి కొందరు ఆకతాయిలు, అవకాశవాదులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు, వాస్తవాలు తేల్చేందుకు ఏపీ సీఐడీ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్‌ నంబర్‌  90716 66667కు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రారంభించిన రెండు రోజుల్లోనే 4,200 మంది ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఫేక్‌ న్యూస్‌లపై వాస్తవాలు కోరడంతోపాటు, కొన్నిటిపై ఫిర్యాదు కూడా చేశారు. వీటికి స్పందిస్తున్న సీఐడీ వాస్తవాలను అందించడంతోపాటు తమ వెబ్‌సైట్‌లో ఫేక్, ఫ్యాక్ట్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచేలా ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవి.. 

► రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌ వి.కనగరాజ్‌ ఒక పాస్టర్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఫోటోతో సహా అసత్య ప్రచారం చేయగా ఆ ఫోటోలో ఉన్నది రెవరెండ్‌ ఎడ్విన్‌ జయకుమార్‌ అనే వేరే వ్యక్తి అని తేలింది. దీనిపై పోలీసు విచారణ కొనసాగుతోంది.  

► మరుగుతున్న నీటి ఆవిరిని పీలిస్తే కరోన వైరస్‌ని 100% చంపి వేస్తుందని,  చైనీస్‌ నిపుణుడు చెప్పినట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వార్త కూడా ఫేక్‌ న్యూస్‌ అని పీఐబీ పేర్కొంది.  

కోవిడ్‌–19 చికిత్స కోసం ఆర్మీ 8 రోజుల్లో వేయి పడకల ఆసుపత్రిని రాజస్థాన్‌లో నిర్మించిందని, నిత్యావసరాలను రైళ్ల ద్వారా రాష్ట్రాలకు పంపిస్తున్నారని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వార్తలు అవాస్తవం.  

► ఏప్రిల్‌ 9 న దీపాలు, కొవ్వొత్తులు వెలిగించిన సమయంలో తీసిన ప్రత్యక్ష చిత్రాన్ని నాసా తీసిందని చెప్తూ, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటో కూడా అది పాత ఫోటోనే. 

► కోవిడ్‌–19 కి రొచే లాబరేటరీస్‌ వాళ్ళు ఔషధాన్ని కనిపెట్టారని, మిలియన్‌ డోసులు రిలీజ్‌ చేస్తారని సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ కూడా పూర్తి అసత్యం. 

గుడ్డిగా నమ్మొద్దు
సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లలో అత్యంత నమ్మకం కలిగించేలా వైరల్‌ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మొద్దు. ఫ్యాక్ట్‌ చెక్‌ చేసుకునేందుకే వాట్సాప్‌ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చాం. సంస్థలు, మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు.  
–పీవీ సునీల్‌కుమార్, ఏపీ సీఐడీ, ఏడీజీ

మరిన్ని వార్తలు