ఏపీలో 164 కరోనా పాజిటివ్‌ కేసులు

4 Apr, 2020 02:31 IST|Sakshi

శుక్రవారం నమోదైన కేసులు 15 

ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌

రాష్ట్రంలో తొలి కరోనా మరణం

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కి చేరింది. గురువారం రాత్రికి 149గా ఉన్న ఈ సంఖ్య శుక్రవారం మరో 15 కేసులతో 164కి పెరిగింది. ఇందులో 140 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్‌ అయినవారివే. కాగా, పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 32 ఉన్నాయి. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది కూడా నెల్లూరులోనే కావడం గమనార్హం. శుక్రవారం నమోదైన 15 పాజిటివ్‌ కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారివేనని అధికారులు తెలిపారు.

పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించి ముమ్మరంగా పారిశుధ్య పనులు చేస్తున్నారు. విదేశీ ప్రయాణికులు, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికులు, వారితో కాంటాక్ట్‌ అయిన వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి, వారిని బయటకు రాకుండా పహారా కాస్తున్నారు. ఇప్పటికే అన్ని చర్యలూ తీసుకున్నట్టు శుక్రవారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, కృష్ణా జిల్లా విజయవాడలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. ఢిల్లీ మత ప్రార్థనకు వెళ్లొచ్చిన యువకుడి నుంచి అతడి తండ్రికి కరోనా సోకడంతో ఆయన మృతి చెందారు. కరోనా సోకేనాటికే యువకుడి తండ్రి హైపర్‌ టెన్షన్, డయాబెటీస్‌తో బాధపడుతున్నట్టు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు