వేటకు విరామం 

14 Apr, 2020 09:19 IST|Sakshi
మచిలీపట్నంలోని గిలకలదిండిలోని సముద్రపాయ వద్ద నిలిచిన బోట్లు

సాక్షి, మచిలీపట్నం: సముద్రంలో మత్స్యసంపదను పెంపొందించే ప్రక్రియలో భాగంగా మరపడవలు, ఫైబర్‌ బోట్లతో చేపల వేటను మంగళవారం అర్ధరాత్రి నుంచి నిషేధించనున్నారు. ఈ నిషేధం జూన్‌ 14 అర్ధరాత్రి వరకు రెండు నెలల పాటు అమల్లో ఉండనుంది. జిల్లాలో 111 కిలోమీటర్ల సముద్ర తీరం నాలుగు మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 64 తీరగ్రామాల్లో 1,63,877 మంది మత్స్యకారులుండగా, వారిలో 38,914 మంది పూర్తిగా వేట ఆధారంగానే జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో 117 మెకనైజ్డ్, 1,530 మోటరైజ్డ్, 139 సంప్రదాయ బోటులు ఉన్నాయి. మెకనైజ్డ్‌ బోటుపై 8 మంది, మోటరైజ్డ్‌ బోటుపై ఆరుగురు, సంప్రదాయ బోటు లపై ముగ్గురు ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. 

సరైన సమయంలో కరోనా దెబ్బ.. 
సాధారణంగా వేట నిషేదానికి ముందు సాధ్యమైనంత ఎక్కువ వేట చేయాలన్న ఆలోచనతో బోట్లన్నీ సముద్రం మీదకు వెళ్తుంటాయి. ప్రతిరోజు కనీసం 50 శాతం బోట్లు వేటకెళ్తుంటాయి. గతేడాది నవంబర్‌ 21 నుంచి ఆయిల్‌ సబ్సిడీని పెంపు అమలులోకి రావడంతో వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వేటకు వెళ్లే ప్రతి బోటుకు 2 నుంచి 3 టన్నులకు పైగా టూనా, రొయ్యలు పడుతుంటాయి. ఇటువంటి సమయంలో కరోనా మరమ్మారి విరుచుకుపడడంతో ఎగుమతులు నిలిచిపోవడంతో ఎక్కడ బోట్లు అక్కడే నిలిచిపోయాయి. వేటకు వెళ్లిన బోట్లు సైతం తీరానికి వచ్చేశాయి. జనతా కర్ఫ్యూ మొదలు నేటి వరకు ఒక్క బోటు కూడా వేటకు వెళ్లిన దాఖలాలు లేవు. జూన్‌ 14వ తేదీ వరకు మళ్లీ వేటకు వెళ్లే చాన్స్‌ లేదు. ఈ నేపథ్యంలో నిషేధ కాలంలో ఇచ్చే భృతిని లాక్‌డౌన్‌ సమయానికి కూడా వర్తింప చేయాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

లాక్‌డౌన్‌ కాలానికీ భృతినివ్వాలి.. 
వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాకుండా.. ఆయిల్‌ సబ్సిడీని రూ.9లకు పెంచడంతో ఎంతో సంబరపడ్డాం. గతంలో ఎన్నడూ లేని విధంగా బోట్లన్నీ వేటకు వెళ్తున్న వేళ కరోనా మహమ్మారి మా ఉపాధికి గండి కొట్టింది. ఈ నేపథ్యంలో వేట నిషేధ సమయంతో పాటు లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన 21 రోజులు కూడా నిషేధ భృతినివ్వాలని కోరుతున్నాం. అలాగే కాలువలపై వేట సాగించే వారితో పాటు ఎండుచేపలు, మార్కెట్లపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులను కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. 
– లంకే వెంకటేశ్వరరావు, బోట్ల యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు 

>
మరిన్ని వార్తలు