పేటలో హై అలర్ట్‌

8 Apr, 2020 12:49 IST|Sakshi
నాయుడుపేట: రెడ్‌జోన్‌ ఏరియాలో ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

నెల్లూరు, నాయుడుపేటటౌన్‌: పట్టణంలో కోవిడ్‌ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏకంగా ఎనిమిది కేసులు నమోదు కావడంతో అధికారులు మంగళవారం హైఅలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లిన 21 మందిలో ఐదుగురికి, అందులో ఇద్దరి వ్యక్తుల కుటుంబ సభ్యులు, బంధువులు ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులను అప్రమత్తం చేశారు. ఆర్డీఓ సరోజినీ, సీఐ జి.వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై డి.వెంకటేశ్వరరావులతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రమాదేవి, వైద్యాధికారిణి దేదీప్యారెడ్డి, వైద్య సిబ్బంది పూర్తి వివరాలను రాబడుతున్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో తరచూ బ్లీచింగ్‌ చల్లించడమే కాకుండా హైపో సోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు.
అప్రమత్తం

గూడూరు: పట్టణంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అచ్యుతకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేశు, సీఐ దశరథరామారావు ఆ వ్యక్తి నివాస ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. రాకపోకలు నిలిపివేశారు. బ్లీచింగ్‌ చల్లించి, పారిశుద్ధ్య పనులు చేపట్టారు. 

క్వారంటైన్‌కు 10 మంది తరలింపు
వాకాడు: వాకాడు మండలం నవాబుపేటలో అనుమానం ఉన్న 10 మందిని అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గోపీనాథ్‌ మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చిన తిరుమూరు, నవాబుపేటలకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ జరిగిందన్నారు. ఈ క్రమంలో నవాబుపేటలో పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు వ్యక్తుల కుటుంబ సభ్యులను 10 మందిని గుర్తించి పరీక్షల నిమిత్తం నెల్లూరు క్వారంటైన్‌కు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజ్యలక్ష్మి, సీఐ నరసింహారావు, వైద్య సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు