4 జిల్లాల్లోనే ఎక్కువ కేసులు

9 Apr, 2020 03:45 IST|Sakshi

బుధవారం 34 కేసులు నమోదు

అత్యధికంగా కర్నూలు జిల్లాలో 75 మందికి పాజిటివ్‌

తాజాగా విశాఖలో ముగ్గురు డిశ్చార్జ్‌

తొమ్మిదికి చేరిన కోలుకున్న వారి సంఖ్య 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు జిల్లాల్లో కరోనా వైరస్‌ ఉధృతి అధికంగా ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచే 60 శాతం కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం రాత్రి 7 గంటల వరకు 854 శాంపిల్స్‌ పరీక్షించగా 34 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 348కు చేరింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు.

► గడిచిన రెండు రోజుల్లో గుంటూరు జిల్లాలో 17 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం 9 కేసులు నమోదు కాగా, బుధవారం మరో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరింది. దీంతో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు పట్టణమంతా దాదాపు కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. 
► బుధవారం అనంతపురం జిల్లాలో 7 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 13కు చేరింది. బుధవారం జరిపిన పరీక్షల్లో కృష్ణాలో 6 కేసులు, నెల్లూరు జిల్లాలో 5, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 3 కేసులు చొప్పున, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. 
► విశాఖపట్నం ఆసుపత్రిలో కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకుని ముగ్గురు బుధవారం డిశ్చార్జి అయ్యారు. వీరిలో ఇంగ్లాడ్‌ నుంచి వచ్చిన 25 ఏళ్ల యువకుడు, అతని ద్వారా కాంటాక్ట్‌ అయిన 51 ఏళ్ల వ్యక్తి, గతంలో మదీనా నుంచి వచ్చిన వ్యక్తి డిశ్చార్జి కాగా.. ఆయన ద్వారా సోకిన 49 ఏళ్ల మహిళ ఉన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారు తొమ్మిదికి చేరింది. నలుగురు మరణించారు.
► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం తిరుమూరులో పదేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామంలో అలజడి రేగింది. ఇటీవల ఈ గ్రామం నుంచి ఓ వ్యక్తి ఢిల్లీకి వెళ్లొచ్చాడు. ఈ వ్యక్తి ఇంటి సమీపంలోనే ఈ బాలిక ఇల్లు ఉండటం గమనార్హం.
► రాష్ట్రంలో 474 క్వారంటైన్‌ సెంటర్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిలో 46,872 పడకలు సిద్ధం చేసింది.

మరిన్ని వార్తలు