పెరుగుతున్న రికవరీ శాతం

30 Apr, 2020 03:47 IST|Sakshi

ఏపీలో నాలుగు రోజులుగా మరణాల్లేవ్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విషయంలో ఉపశమనం కలిగించే విషయం. గడిచిన నాలుగు రోజులుగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. మరోవైపు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన అయిదు రోజుల్లో 142 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 287 మంది డిశ్చార్జి అయినట్లు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో అయిదు రోజుల క్రితం 15.1 శాతంగా ఉన్న  రికవరీ రేటు ఇప్పుడు 21.54 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 31గా ఉంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం 9 గంటల వరకు రికార్డు స్థాయిలో 7,727 మందికి టెస్టులు చేశారు. వీరిలో 73 మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1,332కు చేరింది. చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 1,014గా ఉంది.

పది లక్షల మందికి సగటున 1,649 టెస్టులు
ఏపీలో సగటున పది లక్షల జనాభాకు చేస్తున్న కరోనా టెస్టుల సం ఖ్య 1,649కి చేరింది. గడిచిన కొన్ని రోజు లుగా దేశంలోనే ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందంజలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాటికి రాష్ట్రంలో 88,061 టెస్టులు చేశారు. ఇప్పటి వరకు 1332 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, పాజిటివ్‌ రేటు 1.51 శాతం మాత్రమే ఉంది. దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి సగటున 556 టెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం  7,70,764 టెస్టులు చేశారు. దేశంలో పాజిటివ్‌ కేసుల శాతం 3.84గా ఉంది. మృతుల శాతం దేశీయ సగటు 3.84గా ఉంటే, ఏపీలో 2.33 శాతం ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర వంటి రాష్ట్రాల కంటే మరణాల నియంత్రణలో ఏపీ ముందంజలో ఉంది.  

>
మరిన్ని వార్తలు