హోం ఐసొలేషన్‌కు మార్గదర్శకాలు జారీ

2 Apr, 2020 04:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారు విధిగా ఐసొలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మార్గదర్శకాలు ఇలా..
► విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సంబంధం ఉన్న వారు.. జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోలేక పోవడం వంటి లక్షణాలు కనిపించిన వారు హోం ఐసొలేషన్‌లో ఉండాలి.
► వైరస్‌ సోకిన వ్యక్తిని ఆరోగ్యవంతుడు కలిసినప్పుడు ఇది అతనికీ వర్తిస్తుంది.
► ఒక ఇంట్లో పాజిటివ్‌ వ్యక్తి ఉన్నప్పుడు మిగతా వారికి హోం ఐసొలేషన్‌ వర్తిస్తుంది.
► పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ఎవరినైనా భౌతికంగా తాకినా ఇది వర్తిస్తుంది.
► హోం ఐసొలేషన్‌లో ఉన్న వారు లైజాల్‌ లేదా హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రం చేసి, గాలి వెలుతురు ఉన్న ఇంట్లో ఉండాలి. ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి.
► పదే పదే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఉమ్మి వేయడం, ఎదురుగా వచ్చి దగ్గడం చేయరాదు. కుటుంబంలో ఇతరులతో కలవ రాదు. ప్లేట్లు, గ్లాసులు విడిగా ఉంచుకోవాలి. 
► దగ్గు, జలుబు, జ్వరం వస్తే వెంటనే 104కు కాల్‌ చేయాలి. హోం ఐసొలేషన్‌లో 14 రోజులు ఉన్న తర్వాత తిరిగి నమూనాలు పరీక్షించాలి. నెగిటివ్‌ అని తేలితేనే బయటకు రావాలి.
► ఫిబ్రవరి 10 తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చిన వారందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. 
► ఈ మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అనేది జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, హెల్త్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీఓలు పర్యవేక్షించాలి.

మరిన్ని వార్తలు