కలి‘విడి’గా కరోనాపై యుద్ధం

22 Mar, 2020 04:11 IST|Sakshi

నేడు జనతా కర్ఫ్యూ

ప్రధాని పిలుపు మేరకు జనమంతా తప్పనిసరిగా పాల్గొనాలి  

మహమ్మారిని పారదోలడానికి ప్రజలంతా ఐక్యత చాటాలి 

అత్యవసర సేవలు తప్ప మిగతా సర్వీసులన్నీ నిలుపుదల 

వైద్యులు, అత్యవసర సిబ్బందికి సంఘీభావంగా 5 గంటలకు 5 నిమిషాల పాటు చప్పట్లు

29 వరకు అంతర్జాతీయ విమానాలు నిలిపివేత

స్వచ్ఛందంగా పాల్గొందాం
జనతా కర్ఫ్యూ ద్వారా కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొందాం. ప్రజలు ఎవరూ బయటకు రావద్దు. ప్రయాణాలు, పనులు రద్దు చేసుకోండి. సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాలు బయటకు వచ్చి కోవిడ్‌ నివారణకు కృషి చేస్తున్న సిబ్బందికి మద్దతుగా చప్పట్లు కొట్టి సంఘీభావం తెలుపుదాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధాని మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు మేరకుఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఎవ్వరూ బయటకు రావద్దని గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో శనివారం ప్రభుత్వం ప్రచారం నిర్వహించింది.  రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులను కర్ఫ్యూ సమయంలో తిరగకుండా రద్దు చేసింది. మద్యం దుకాణాలతో పాటు బార్లు కూడా ఆదివారం మూసి వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పెట్రోల్‌ బంకులు కూడా మూసివేయాలని నిర్ణయించారు. 

సాక్షి, అమరావతి/సాక్షి, మచిలీపట్నం /విమానాశ్రయం (గన్నవరం):  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు మేరకు అత్యవసర సేవలు మినహా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఎటువంటి సంస్థలైనా ఆదివారం తెరవరాదని జిల్లా యంత్రాంగాలు ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఎవ్వరూ బయటకు రావద్దని గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో శనివారం ప్రభుత్వం ప్రచారం నిర్వహించింది. అత్యవసర సర్వీసులు తప్ప మిగతా సర్వీసులన్నింటినీ నిలిపివేసి జనతా కర్ఫ్యూలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులను ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దు చేసింది. దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ సర్వీసులను శనివారమే నిలిపివేశారు. సిటీ సర్వీసులను కూడా రద్దు చేశారు. పోలీసు, వైద్య సిబ్బంది, మెడికల్‌ సర్వీసులు, విద్యుత్, అగ్నిమాపక సిబ్బంది, పాలు వంటి నిత్యావసర వస్తువులు, ఇతర ఎమర్జెన్సీ సర్వీసులు మినహా మిగతా సర్వీసులన్నింటినీ నిలిపివేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంది. మద్యం దుకాణాలతో పాటు బార్లు కూడా ఆదివారం మూసి వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పెట్రోల్‌ బంకులు కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించారు.  

ఇంటికే పరిమితమైతే.. 
ప్రధాని పిలుపు మేరకు ఆదివారం 14 గంటల పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. దీనివల్ల  స్వీయ రక్షణ పొందడమే కాకుండా వైరస్‌ సోకిన వారి నుంచి మరొకరికి సోకకుండా కాపాడిన వారు అవుతారని చెబుతున్నారు. కరోనా మహమ్మారిని పారదోలడానికి ప్రతీ ఒక్కరు జనతా కర్ఫ్యూలో పాల్గొని భారతదేశం ఐక్యతను చాటిచెప్పాలి. 

ప్రధాని పిలుపు మేరకు
ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రజలు తమ ఇళ్ల ముంగిటకు వచ్చి 5 నిముషాల పాటు నిలబడి కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి విశేషంగా సేవలందిస్తున్న సిబ్బందికి, ప్రజలకు, ఎమర్జెన్సీ సేవలందిస్తున్న వారికి మద్దతుగా చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ కృతజ్ఞతలు తెలియజేయాలి. సాయంత్రం ఐదు గంటలకు స్థానిక అధికారులు సైరన్‌ మోగిస్తారు. అప్పుడే ప్రజలు 5 నిముషాల పాటు బయటకు వచ్చి చప్పట్లు కొట్టి మళ్లీ ఇళ్లలోకి వెళ్లిపోవాలి. ప్రధాన మంత్రి పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.  

నేడు బస్సులన్నీ బంద్‌ 
జనతా కర్ఫ్యూకు సంఘీభావంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. శనివారం సాయంత్రం నుంచే దూరప్రాంత సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. మచిలీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి నాని చెప్పిన వివరాలు.. 
- ఆదివారం పల్లె వెలుగుతో సహా రాష్ట్రంలో ఏ ఒక్క ఆర్టీసీ బస్సు తిరగదు. రాత్రి నుంచి దూర ప్రాంత సర్వీసులను పునరుద్ధరిస్తాం.  
- ప్రైవేటు సర్వీస్‌లను కూడా నిలిపేయాలని సంబంధిత ప్రైవేటు ఆపరేటర్లను కోరాం.  
- ఆటోలు, టెంపోల్లో ఇష్టమొచ్చినట్టుగా ప్రయాణికులను ఎక్కించుకుంటే చూస్తూ ఊరుకోం.  
- కరోనా కట్టడికి రూ. 200 కోట్లు కేటాయించాం. వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలి.  
- మీ ఇళ్లకు, ఇరుగుపొరుగు ఇళ్లకు విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే డయల్‌ 100కు లేదా సమీప సచివాలయ సిబ్బందికి లేదా వలంటీర్‌కు సమాచారం ఇవ్వాలి.  

స్తంభించనున్న రవాణా.. 
‘జనతా కర్ఫ్యూ’ కారణంగా రాష్ట్రంలో రవాణా సేవలు మొత్తం స్తంభించిపోనున్నాయి. ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రైవేటు బస్సులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోనున్నాయి. ఆర్టీసీలో 11 వేలకు పైగా బస్సులు డిపోలకు పరిమితం కానున్నాయి. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్‌ ఆపరేటర్లు కూడా టికెట్‌ బుకింగ్‌లు నిలిపేశారు. ప్రయాణికులు బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కూడా ఏసీ సర్వీసుల్ని రద్దు చేసింది. వయో వృద్ధులకు ఇచ్చే 25% రాయితీని తాత్కాలికంగా రద్దు చేసింది.  

కొన్ని జాగ్రత్తలు..
- బస్సుల్లో ప్రయాణించే వారి మధ్య దూరం ఉండేలా చర్యలు 
చేపట్టారు.  
- షేరింగ్‌ ఆటోలను తిప్పకుండా రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రయాణికుల్ని చేరవేసే వాహనాల్లో రోజూ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారి చేసేలా చర్యలు చేపట్టారు. 
- శనివారం మధ్యాహ్నం నుంచే రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద వాహనాలను అధికారులు నిలిపేస్తున్నారు. ఈ నెల 31వరకు తమ రాష్ట్ర సరిహద్దులను మూసేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.  
- రాష్ట్రంలో ఓలా, ఉబెర్‌ వంటి షేరింగ్‌ సర్వీసులు కూడా నిలిపివేస్తున్నారు.   

తమిళనాడుకు నో ఎంట్రీ 
తడ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో ఇరురాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తడ, తమిళనాడు సరిహద్దులోని ఆరంబాకం పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఆంధ్రా నుంచి తమిళనాడు వైపు వెళ్లే ప్రయాణికుల వాహనాలను జాతీయ రహదారిపై తనిఖీలు చేశారు. అత్యవసర సేవల వాహనాలను మినహా మిగిలిన వాటిని వెనక్కి పంపిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రా పోలీసులు బీవీ పాళెం చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. చెక్‌పోస్టు వద్ద వైద్య సిబ్బందితో శిబిరం ఏర్పాటు చేశారు. అనుమానితులకు అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, తమిళనాడు వైపు వెళ్లే వారు ప్రయాణాలను విరమించుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని సూచించారు. ఆర్టీసీ బస్సులు మాత్రమే అనుమతిస్తున్నారని, ప్రైవేటు వాహనాల్లో వెళ్లే వారిని తమిళనాడు ప్రభుత్వం అనుమతించటం లేదన్నారు.  

15 విమాన సర్వీసులు రద్దు
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు నగరాల నుంచి గన్నవరం విమానాశ్రయానికి నడిచే 15 విమాన సర్వీస్‌లను రద్దు చేశారు. ట్రూజెట్, ఇండిగో, స్పైస్‌జెట్‌కు చెందిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కడప, వైజాగ్, తిరుపతి విమాన సర్వీస్‌లను ఆదివారం రద్దు చేసినట్లు తెలిపారు. ఎనిమిది విమాన సర్వీస్‌లు మాత్రమే నడుస్తాయని వెల్లడించారు. అందుకు తగ్గట్లుగా ప్రయాణికులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు