కరోనా వైరస్‌: కోయంబేడు టెన్షన్‌

20 May, 2020 09:13 IST|Sakshi

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చెన్నై కోయంబేడు మార్కెట్‌ లింక్‌లు ఎక్కువగా ఉండడంతో కొత్త కేసులు వేగంగా వెలుగు చూస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 19 కేసులు నమోదయ్యాయి. అందులో 17 సూళ్లూరుపేట పట్టణానికి చెందినవి కావడం గమనార్హం. తాజా వాటితో కలిపి కేసుల సంఖ్య 183కి చేరింది. మంగళవారం నిర్ధారణ కేసుల్లో గూడూరు పట్టణంలో ఒకటి, కోట సమీపంలో విద్యానగర్‌లో మరొకటి ఉన్నాయి. మిగిలినవి సూళ్లూరుపేటలోని మహదేవయ్య నగర్, వనంతోపు, వట్రపాళెం, మన్నారుపోలూరుల్లో నమోదయ్యాయి. వారంరోజుల్లోనే సూళ్లూరుపేటలో 60 కేసులు వచ్చాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. (డబ్ల్యూహెచ్‌ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి)

పేటలో కరోనా నిర్ధారణ కోసం పెద్దఎత్తున ట్రూనాట్, ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను, పాజిటివ్‌దారులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. జిల్లాలోని 12 క్వారంటైన్‌ సెంటర్లకు 489 మంది అనుమానితులను తరలించిన వైద్యులు వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం 74 మంది ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా చూస్తే పీసీఆర్, ట్రూనాట్‌ పద్ధతిలో 20,019 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షించారు. అందులో 19,035 మందికి నెగెటివ్‌ రాగా మరో 183 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక 801 మందికి ల్యాబ్‌ రిపోర్టు రావాల్సి ఉంది.(కరోనా పాజిటివ్‌.. ఇదో అవలక్షణం! )

నెల్లూరులోనే  కరోనా నిర్ధారణ
నెల్లూరు(అర్బన్‌): కరోనా నిర్ధారణ పరీక్షలు ఇక నుంచి నెల్లూరులోనే చేయనున్నారు. నగరంలోని పెద్దాస్పత్రిలో ఏర్పాటుచేసిన వైరాలజీ ల్యాబ్‌లో మంగళవారం నుంచి పీసీఆర్‌ పరీక్షలు ప్రారంభించారు. తొలిరోజు 14 పాజిటివ్‌ కేసులు ప్రకటించారు. కరోనా కేసులకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినా ఫైనల్‌గా నిర్ధారించేందుకు తిరుపతి స్విమ్స్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపేవారు. అక్కడినుంచి ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలో పీసీఆర్‌ పరీక్షలు చేసే పరికరాలను పంపించింది.

వైరాలజీ విభాగం ఆధ్వర్వంలో పలు దఫాలుగా పరీక్షలు నిర్వహించి వాటిని సరి చూసేందుకు తిరుపతికి పంపారు. ఇలా ఒకటికి మూడుసార్లు పరిశీలించారు. అలాగే ల్యాబ్‌ టెక్నీషియన్లు ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఇక్కడ చేసిన పరీక్షలన్నీ తిరుపతిలోనూ చేసి ఎటువంటి తేడా లేదని చెప్పడంతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో పీసీఆర్‌ పరీక్షలను ప్రారంభించారు. ఇక ఫైనల్‌ రిపోర్టు కోసం తిరుపతికి పంపాల్సిన అవసరం లేదు.  

మరిన్ని వార్తలు