కరోనాపై ప్రజాయుద్ధం

28 Mar, 2020 04:49 IST|Sakshi
శ్రీకాకుళంలో నిర్మానుష్యంగా మారిన ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్‌

రాష్ట్రవ్యాప్తంగా పటిష్టంగా లాక్‌డౌన్‌ 

ఊరూవాడా ప్రశాంత వాతావరణం 

రోడ్లపైకి రావడం తగ్గించిన జనం 

పలుచోట్ల నిత్యావసర సరుకులు డోర్‌ డెలివరీకి ఏర్పాట్లు 

కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ పటిష్టంగా అమలవుతోంది. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావడం తగ్గించడంతో అన్నిచోట్లా ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అనుగుణంగా ప్రజలు కూడా నడుచుకుంటుండటంతో శుక్రవారం నుంచి వీధుల్లోని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ప్రతిచోటా బహిరంగ ప్రదేశాల్లో కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేయడం, పలుచోట్ల వివిధ మాల్స్, దుకాణదారుల ద్వారా నిత్యావసర వస్తువులను డోర్‌ డెలివరీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా కరోనాపై ప్రజాయుద్ధం మొదలైంది.                            
– సాక్షి నెట్‌వర్క్‌  

విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి 
గుంటూరులో ఒకచోట పాజిటివ్‌ కేసు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించి ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశాడనేది ఆరా తీసి.. సన్నిహితంగా మెలిగిన 34 మందిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని ఇతర పట్టణాల్లోనూ నిత్యావసర సరుకులను డోర్‌ డెలివరీ చేసేలా ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. పొందుగల, నాగార్జున సాగర్‌ చెక్‌పోస్టుల వద్ద శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. 

- పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడికక్కడే క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం 1,640 బెడ్లు సిద్ధం చేశారు. విదేశాల నుంచి జిల్లాకు 4,146 మంది వచ్చినట్లు గుర్తించి వారందరినీ 28 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉంచి వారి ఇళ్ల వద్ద పోస్టర్లు అతికిస్తున్నారు.  
- కడప జిల్లాలో లాక్‌ డౌన్‌ అమలును కట్టుదిట్టం చేయటంతో జనాలు బయటకు రాలేదు. విజయనగరం జిల్లాలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేదు. జిల్లాలో సుమారు 200 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. 
- ప్రకాశం జిల్లాలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలైంది. చీరాల ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని తొలగించి అనుమానిత లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే వారిని చీరాల ఏరియా హాస్పిటల్‌కు తరలించేలా నిర్ణయం తీసుకున్నారు.  
- ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో మాల్స్‌ యాజమాన్యాలతో మాట్లాడి నిత్యావసర సరుకుల డోర్‌ డెలివరీని ప్రారంభించారు. మండపేట మున్సిపల్‌ అధికారులు మూడు రంగులతో కూడిన పాస్‌లను ప్రజలకు అందజేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎవరు ఏ సమయాల్లో వెళ్లాలో నిర్దేశిస్తూ ఈ పాస్‌లను వలంటీర్ల ద్వారా జారీ చేస్తున్నారు. 
- కర్నూలు జిల్లాలో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌కు ఫోన్‌ చేస్తే ఇంటికే సరుకులు పంపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అంబేడ్కర్‌ వర్సిటీలో నిర్వహిస్తున్న క్వారంటైన్‌లో 61మంది ఉన్నారు. వీరిలో విదేశీయులే ఎక్కువమంది. ముస్లింలు ఇంటి వద్దే నమాజ్‌ చేసుకోవాలని శ్రీకాకుళం జామియా మసీదు వద్ద బోర్డు ఏర్పాటు చేశారు. 
- నెల్లూరులోని సర్వజనాస్పత్రిని అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలకు రీజినల్‌ కోవిడ్‌ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. 600 బెడ్స్‌తో కూడిన ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ శేషగిరిబాబు సూచించారు. జిల్లాలో 1,554 మందిని హోం క్వారంటైన్‌ చేశారు.  
- చిత్తూరు జిల్లా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చిత్తూరు నగరానికి ఇటలీ నుంచి ఓ వ్యక్తి రావడంతో అతడిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు