కరోనా మేనేజ్‌మెంట్‌ కమిటీల ఏర్పాటు

6 Apr, 2020 08:22 IST|Sakshi
నిర్మానుష్యంగా గుంటూరు నగరం గడ్డిపాడు రోడ్డు  

అష్టదిగ్బంధంలో గుంటూరు నగరం 

విధులకు హాజరు కాని ప్రైవేటు వైద్యులు, నర్సులపై  ఎస్మాకు ఆదేశాలు 

మొబైల్‌ బృందాల ద్వారా కరోనా శాంపిళ్ల సేకరణ  

సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు  పెరుగుతున్న నేపథ్యంలో అధికారు లు ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. అడుగడుగునా నిబంధనలు విధిస్తూ గుంటూరు నగరంతో పాటు అన్ని ప్రాంతాలను అష్టదిగ్బంధం చేశారు. రెడ్‌జోన్‌ ఏరియాల్లో రాకపోకలను నియంత్రించా రు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, కూర గాయలు, పండ్లను ఇంటి ముంగిటకే చేర్చే ఏర్పా ట్లు చేస్తున్నారు. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌  ని బంధనలు సడలించినా రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో మా త్రం కఠిన ఆంక్షలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు.    

మొబైల్‌ టీమ్‌ల ద్వారా శాంపిళ్ల సేకరణ 
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో పాటు, విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్‌లోనే ఉండాలని, అవసరమైన వైద్య సేవలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కరోనా అనుమానితులను క్వారంటైన్‌ సెంటర్లకు తరలించి మొబైల్‌ టీమ్‌ల ద్వారా శాంపిళ్లు సేకరిస్తున్నారు. గుంటూరు నగరంలో అణువణువునా రెండు ఫైర్‌ ఇంజిన్లు, ప్రత్యేక యంత్రాల ద్వారా సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. గుంటూరులో కేసులు పెరుగుతున్న దృష్ట్యా  నగరంలోకి రాకపోకలను నిలిపి వేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, అడిషనల్‌ డీజీ కృపానంద త్రిపాఠి, ఐజీ ప్రభాకరరావు, అర్బన్, రూరల్‌ ఎస్పీ విజయరావులు నిర్ణయం తీసుకున్నారు.    

కరోనా మేనేజ్‌మెంట్‌ కమిటీల ఏర్పాటు  
జిల్లాలో ఇప్పటికే 30 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా కరోనా మేనేజ్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఆప్రాంతంలో ఉన్న పెద్దలు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయనున్నారు. కరోనా వ్యాప్తి జరుగకుండా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలను కమిటీల ద్వారా వివరించి ఆ ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 471 శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లకు పంపగా అందులో 30 పాజిటివ్‌గా వచ్చాయి. 377 నెగిటివ్‌ వచ్చాయి. మిగిలిన ఫలితాలు రావాల్సి ఉంది.

ప్రైవేటు వైద్యులు, నర్సులు సహకరించాలి
ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులు, అందులో పనిచేసే నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని అత్యవసర సరీ్వసుల కిందకు తెచ్చింది. ప్రైవేటు వైద్యులు, నర్సులు విధులకు గైర్హాజరైతే వారి లైసెన్సులు రద్దు చేస్తాం. ఎస్మాను ప్రయోగిస్తాం. దీంతో వారు ప్రాక్టీస్‌ చేసుకోవడంతోపాటు, ఉద్యోగం చేసుకునే అవకాశం కోల్పోతారు. కాబట్టి ప్రైవేటు వైద్యులు, నర్సులు, సిబ్బంది ప్రభుత్వానికి సహకరించాలి. దీంతో పాటు కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యవంతం చేయడంతోపాటు, అక్కడ మెరుగైన చర్యలు తీసుకునే దిశగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నాం. లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నాం.  
– ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, జిల్లా కలెక్టర్, గుంటూరు

నేడు గుంటూరులో సంపూర్ణ లాక్‌డౌన్‌ 
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో సోమవారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు గుంటూరు రేండ్‌ ఐజీ ప్రభాకర్‌రావు చెప్పారు.  బ్యాంకులు, రైల్వే, ఇతర కార్యాలయాలకు వెళ్లే వారిని ఉదయం 10 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలోనే అనుమతిస్తామన్నారు. జిల్లాలో రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసినట్టు  సాక్షికి చెప్పారు. కరోనా పాజిటివ్‌ నమోదైన వారి నుంచి లోకల్‌ కాంటాక్ట్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో భద్రత మరింత పెంచామన్నారు. నగరానికి నాలుగు ఏపీఎస్పీ బెటాలియన్లు కేటాయించామన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, గతనెల 17వ తేదీ దురంతో, 20వ తేదీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వారు ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. 

మరిన్ని వార్తలు