శాంపిల్స్‌ సేకరణకు మొబైల్‌ కియోస్క్‌లు

14 Apr, 2020 04:49 IST|Sakshi
కోవిడ్‌ పరీక్షల కోసం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ కియోస్క్‌లు

ప్రథమంగా శ్రీకాకుళంలో ప్రారంభం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కరోనా వైరస్‌ నిర్ధారణకు శాంపిల్స్‌ సేకరణ పెంచి మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకాకుళం జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇంతవరకు జిల్లాలో పాజిటివ్‌ కేసులు లేకపోయినప్పటికీ.. మున్ముందు వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అనుమానితుల నుంచి శాంపిల్స్‌ తీసుకునేందుకు మొబైల్‌ కోవిడ్‌ విస్క్‌ (వాక్‌ ఇన్‌ శాంపిల్‌ కియోస్క్‌)లను వినియోగించనున్నారు. తొలి విడతగా తయారు చేసిన మొబైల్‌ కరోనా పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ సోమవారం పరిశీలించారు. జిల్లాలో మొదటగా రెండు మొబైల్‌ కరోనా పరీక్ష కేంద్రాలను బుధవారం నుంచి అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం జిల్లా అంతా ఈ మొబైల్‌ కోవిడ్‌ విస్క్‌లు తిరుగుతాయి. పరీక్షలు నిర్వహించే వారికి వైరస్‌ సోకకుండా ఇవి సురక్షితంగా ఉంటాయి. ఇదిలా ఉండగా జిల్లా సర్వజన ఆసుపత్రి, మరో ఆరు  కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో వాక్‌ ఇన్‌ శాంపిల్‌ కియోస్క్‌ (విస్క్‌)లను ఏర్పాటు చేస్తున్నారు. వాటితో పాటు పాలకొండ, పాతపట్నం, సీతంపేట, కొత్తూరు, బారువ, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, హరిపురం, కోటబొమ్మాళి, నరసన్నపేట, పలాస, టెక్కలి, బుడితి, ఆమదాలవలస, రాజాం, పొందూరు, రణస్థలంలో కోవిడ్‌ విస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని 20 ఆసుపత్రుల్లో టీబీ పరీక్షల నిర్వహణ కేంద్రాలను కరోనా పరీక్ష కేంద్రాలుగా వినియోగించనున్నారు. ప్రతి రోజూ 200 నమూనాల సేకరణ, పరీక్షలు చేసే లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు