ఆకాశవీధిలో నిఘా నేత్రం

13 Apr, 2020 04:26 IST|Sakshi

రాష్ట్రంలోని రెడ్‌జోన్‌లలో డ్రోన్లతో పర్యవేక్షణ

జనం గుమిగూడినా, పోలీసుల విధి నిర్వహణపైనా చిత్రీకరణ

ఎప్పటికప్పుడు పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు వీడియోలు

లాక్‌డౌన్‌ ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజలను రక్షించే క్రమంలో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైనే రాత్రి పగలు గస్తీ కాస్తున్న పోలీసులు.. మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు చేయడానికి డ్రోన్లను రంగంలోకి దించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ పరిధిలోని టెక్‌ సర్వీసెస్‌ విభాగం పర్యవేక్షణలో ఇప్పుడు రాష్ట్రంలోని రెడ్‌ జోన్‌లలో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్రంలోని గుంటూరు, తెనాలి, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురంలోని కంటైన్మెంట్‌ జోన్‌లలో పోలీసు అధికారులు ఆదివారం డ్రోన్లతో స్థానిక పరిస్థితిని పర్యవేక్షించారు. 

 డ్రోన్లతో నిఘా వెనుక వ్యూహం ఏమిటంటే..
► రాష్ట్రంలో రెడ్‌జోన్‌లు, ఆరెంజ్‌ జోన్‌లు వంటి ఇబ్బందికరమైన ప్రాంతాల్లోను పోలీసులు నిఘా మరింత పెంచారు. అయితే ప్రమాదకరమైన ప్రాంతాల్లో పోలీసులు స్వయంగా వెళ్లి నిత్యం పరిశీ లించడం ఇబ్బందికరంగా మారిన నేప థ్యంలో డ్రోన్లను రంగంలోకి దించారు. 
► పోలీస్‌ శాఖలోని టెక్‌ సర్వీసెస్‌ విభాగం పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 52 డ్రోన్లను వినియోగిస్తున్నారు. రాష్ట్రం లోని పట్టణాలతో పాటు దాదాపు అన్ని జిల్లాల్లోని రెడ్‌జోన్‌లలో డ్రోన్లతో నిఘా పెట్టారు. 
► డ్రోన్‌ సమాచారంతో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించే వారిపై సెక్షన్‌ 188 ప్రకారం కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.   
► కంటైన్మెంట్‌ ఏరియాల్లో రోజుకు మూడు పర్యాయాలు, మూడేసి కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు ఆకాశంలో తిరుగుతూ వీడియోను చిత్రీకరిస్తున్నాయి. ఎవరైనా బయట గుంపులుగా తిరుగుతున్నారా? డ్యూటీలో ఉన్న పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా? లాక్‌డౌన్‌ ఎలా అమలు జరుగుతోంది? అనే విషయాలను తెలుసుకునేందుకు డ్రోన్లు దోహదపడుతున్నాయి. 
► ఉదయం లాక్‌డౌన్‌ సడలింపు సమయంలోను, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అవి రెండు నుంచి ఐదు నిముషాల పాటు వీడియోలు చిత్రీకరిస్తున్నాయి. 
► డ్రోన్ల వీడియోలను పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. ఆయా వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్న పోలీసు అధికారులు తదుపరి చర్యలకు ఆదేశాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు