కరోనా : మన నేవీ.. మహా భద్రం

19 Apr, 2020 12:17 IST|Sakshi
తూర్పునౌకాదళ ప్రధాన కేంద్రం

విపత్తులు విరుచుకుపడినా.. మహమ్మారులు కబళించినా.. వారు మాత్రం విధులను విడిచిపెట్టరు. నిరంతరం దేశరక్షణలో నిమగ్నమయ్యే మన రక్షణ వ్యవస్థలోకి కరోనా వైరస్‌ చొరబడటం ఆందోళన రేపుతోంది. మొదట ఆర్మీలోకి.. తాజాగా నావికాదళంలోకి ప్రవేశించిన ఈ మహమ్మారి కలవరం రేపుతోంది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న 20 మంది నేవీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ సోకినట్లు తేలడంతో మొత్తం నౌకాదళం అప్రమత్తమైంది. వారు పని చేస్తున్న వార్‌షిప్‌ మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో విశాఖ కేంద్రంగా పని చేస్తున్న తూర్పు నౌకాదళం పరిస్థితి ఏమిటన్న సందేహాలు, ఆందోళనలు మొదలవ్వడం సహజం. అయితే.. జనతా కర్ఫ్యూ నాటి నుంచే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో తూర్పు నౌకాదళం సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ముందు జాగ్రత్తగా మూడు వారాల క్వారంటైన్‌ తర్వాతే సిబ్బందిని అత్యవసర విధులకు అనుమతిస్తున్నామని ఈఎన్‌సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: భారతీయ నౌకాదళంలో కరోనా కలకలం రేగింది. దేశ వ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్‌ రక్షణ వ్యవస్థలోకి చొరబడకపోవడంతో త్రివిధ దళాలు ఇన్నాళ్లూ ఉపిరి పీల్చుకుంటూ వచ్చాయి. అయితే గత వారంలో ఆర్మీలోని కొందరికి.. ఇప్పుడు నేవీ సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వెస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ముంబైలోని ఐఎన్‌ఎస్‌ ఆంగ్రే నౌకలో విధులు నిర్వర్తిసున్నత 20 మంది ఉద్యోగులకు పాజిటివ్‌ సోకడంతో వారిని ముంబైలోని ఐఎన్‌ఎస్‌హెచ్‌ అశ్విని ఆస్పత్రిలో చేర్చారు. ఈ పరిణామాలతో తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. ఇక్కడ మొదటి నుంచే కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపడుతున్నందున కరోనా ముప్పు లేదని ఈఎన్‌సీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

క్వారంటైన్‌ పూర్తయ్యాకే విధుల్లోకి...

  • కరోనాపై యుద్ధంలో భాగంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ విజయవంతంగా పూర్తి చేసిన తూర్పు నౌకాదళం.. ప్రస్తుతం లాక్‌డౌన్‌నూ పటిష్టంగా అమలు చేస్తోంది. ఈఎన్‌సీ ప్రధాన కేంద్రంలో సుమారు వెయ్యిమంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 
  •  లాక్‌డౌన్‌లో భాగంగా సేవలన్నీ నిలిపివేశారు. అత్యవసర సేవలు, భద్రతా విధులను మాత్రమే నిర్వర్తిస్తున్నారు. 
  • లాక్‌డౌన్‌లో తొలి 14 రోజులు సిబ్బందిలో అవివాహితులతో పని చేయించారు. మిగిలిన సిబ్బందికి మూడు వారాల క్వారంటైన్‌ తప్పనిసరి చేశారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేనివారినే  విధులకు అనుమతిస్తున్నారు.
  • కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించడంతో అత్యవసర విధులకు ఆటంకం కలగకుండా ఈఎన్‌సీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 
  • 50 శాతం ఉద్యోగులతో షిప్టుల వారీగా సేవలందిస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగుల సేవలను అత్యవసరమైతేనే వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఈఎన్‌సీ పరిధిలో ఉద్యోగులందరూ ఆరోగ్యంగా ఉన్నారని నౌకాదళ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

భద్రత విషయంలో రాజీలేదు
కోవిడ్‌–19 విజృంభిస్తున్న వేళ.. తూర్పు నౌకాదళంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం. ఇప్పటికే 200 పడకలతో ఐఎన్‌ఎస్‌ విశ్వకర్మ వద్ద క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నాకే అనుమతి ఇస్తున్నాం. ఆఫ్‌షోర్‌ పెట్రోలింగ్‌కు వినియోగిస్తున్న నౌకలు, అత్యవసర విభాగాల్లో మాత్రం అందరూ విధులు నిర్వర్తిస్తున్నారు. శానిటైజర్లు, స్ప్రేయింగ్‌ చేస్తున్నాం. మాసు్కలు ధరించాలని నిబంధనలు విధించాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తీర భద్రత విషయంలో రాజీ పడటం లేదు. సవాళ్లను ఎదుర్కొడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఈఎన్‌సీ ఆధ్వర్యంలో సహాయ చర్యలు కూడా నిర్వహిస్తున్నాం.  – వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌జైన్, తూర్పు నౌకాదళాధిపతి   

మరిన్ని వార్తలు