కరోనాపై ఆధునిక పోరు

20 Apr, 2020 08:28 IST|Sakshi
చెన్నై నుంచి తెప్పించనున్న స్ప్రేయింగ్‌ యంత్రం 

వైరస్‌ విరుగుడుకు సరికొత్త అస్త్రాలు ఇప్పటికే ఫైరింజన్, డ్రోన్‌ వినియోగం

తాజాగా బీహెచ్‌ఈఎల్‌ నుంచి ప్రత్యేక స్ప్రేయర్‌ వాహనం 

నేటి నుండి రెడ్‌ జోన్లలో వినియోగం 

సాక్షి, ఒంగోలు:  కరోనాపై ఆధునిక పరికరాలతో అధికార యంత్రాంగం పోరు సాగిస్తోంది. వైరస్‌ విరుగుడుకు సరికొత్త అ్రస్తాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే ఫైరింజన్, డ్రోన్ల ద్వారా హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని స్ప్రేయింగ్‌ చేయించిన నగర పాలక సంస్థ, తాజాగా చెన్నైలోని బీహెచ్‌ఈఎల్‌ నుంచి ప్రత్యేక స్ప్రేయింగ్‌ వాహనాన్ని తెప్పించనుంది. రూ.3.50 లక్షలతో ఈ వాహనానికి నగర పాలక సంస్థ ఆర్డర్‌ పెట్టింది. సోమవారం ఈ వాహనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వాహనం వచ్చిన వెంటనే రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేయించేందుకు నగర పాలక సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకాశం జిల్లాకు సంబంధించి తొలి కరోనా కేసు ఒంగోలులోని ఎన్‌జీఓ కాలనీలో నమోదైంది. రోజుల వ్యవధిలో రాజీవ్‌గృహకల్పలో మరో కేసు నమోదైంది.

అనంతరం ఇస్లాంపేటలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇస్లాంపేట, బండ్లమిట్ట, రాజీవ్‌గృహకల్ప ప్రాంతాలను నగర పాలక సంస్థ రెడ్‌జోన్లుగా ప్రకటించి అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు నగర పాలక సంస్థ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇస్లాంపేటలోని ప్రతి ఇంట్లోని ప్రతి భాగాన్ని హైపోక్లోరైట్‌ ద్రావణంతో స్ప్రే చేయించింది.  ఫైరింజన్లతో కూడా స్ప్రే చేయించింది. ఇంటి పైభాగం, చెట్లపైన కరోనా వైరస్‌ క్రిములేమైనా ఉంటాయన్న ఉద్దేశంతో డ్రోన్‌ను కూడా ప్రయోగించింది. తాజాగా బీహెచ్‌ఈఎల్‌ నుంచి ప్రత్యేక వాహనాన్ని రప్పిస్తోంది. ఈ వాహనం ద్వారా హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని చల్లితే ఎలాంటి క్రిములైనా నాశనం కానున్నాయి. ఆ వాహనం కోసం నగర పాలక సంస్థ అధికారులు ఎదురు చూస్తున్నారు. 

మరిన్ని వార్తలు