ఏపీలో 9 లక్షలకు చేరువలో నిర్ధారణ పరీక్షలు

1 Jul, 2020 02:31 IST|Sakshi

అత్యధిక టెస్ట్‌లు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపు

గడచిన 24 గంటల్లో 704 పాజిటివ్‌ కేసులు నమోదు

సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా పరీక్షలు 9 లక్షలకు చేరువయ్యాయి. మంగళవారం నాటికి 8.90 లక్షల పరీక్షలు పూర్తవ్వగా.. ఈ సంఖ్య బుధవారం నాటికి 9 లక్షలు దాటనుంది. రోజు కు కేవలం 90 పరీక్షలతో మొదలై.. ఇప్పుడు రోజుకు 30 వేల టెస్ట్‌లు చేస్తున్న రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా గడచిన 24 గంటల్లో 704 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన 51 మంది, ఇతర దేశాలకు చెందిన 5మంది కరోనా పాజిటివ్‌గా నమోదయ్యారు. మరో 258 మంది డిశ్చార్జి అయ్యారు.

గడచిన 24 గంటల్లో కరోనాతో మొత్తం ఏడుగురు చనిపోయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 14,595 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 7,897 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 107 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తాజా గణాంకాల ప్రకారం మిలియన్‌ జనాభాకు 16,670 మందికి టెస్ట్‌లు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది.  

మరిన్ని వార్తలు