కొందరి నిర్లక్ష్యం.. ఉద్యోగులకు శాపం 

21 Apr, 2020 08:44 IST|Sakshi

ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచిన ఫలితం 

క్వారంటైన్‌ కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘన

అధికారులకు, కుటుంబ సభ్యులకు ప్రబలిన కరోనా వైరస్‌ 

రెండు రోజుల్లో 25 పాజిటివ్‌ కేసులు... 

శ్రీకాళహస్తిలో అత్యధికం 

జిల్లాలో మొత్తం కేసులు 53 

లాక్‌డౌన్‌ ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం 

కొందరి నిర్లక్ష్యం కరోనా విధుల్లో పాల్గొంటున్న అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు శాపంగా మారింది. కరోనా లక్షణాలున్న వారు సరైన సమయంలో పరీక్షలు చేయించుకోకపోవడం, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోవడంతో ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్న అధికారులనూ కరోనా మహమ్మారి కబళిస్తోంది. ఈ క్రమంలో జిల్లా ప్రజలందరూ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత కఠినతరం చేశారు.

సాక్షి, తిరుపతి : జిల్లాలో లండన్‌ నుంచి వచ్చిన శ్రీకాళహస్తి యువకుడికి తొలిసారి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఆ యువకుడు కరోనా వైరస్‌ను ముందే గుర్తించి తనకుతానుగా ఆస్పత్రిలో చేరిపోవడం, కుటుంబ సభ్యులు క్వారంటైన్‌కి వెళ్లడంతో వారి నుంచి ఎవ్వరికీ వైరస్‌ సోకలేదు. అయితే ఢిల్లీలోని మర్కత్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచి జిల్లాలో కల్లోలం మొదలైంది. తిరుపతికి చెందిన యువకుడి నుంచి మొదలైన కరోనా కల్లోలం ఇప్పటికీ ఆగలేదు. ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో ఆ యువకుడితో మొదలై వారి కుటుంబ సభ్యులకు, వారి ద్వారా ఇద్దరికి, హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నమోదైంది. (ఎండలో ఎలా వెళ్తావు తల్లీ..)

ఆది, సోమవారాల్లోనే 25 పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. ఒక్క శ్రీకాళహస్తిలోనే 24, చంద్రగిరి మండలం రంగంపేటలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 53 కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు పాజిటివ్‌ రోగులు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 49 మంది ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఫలితంగా లాక్‌డౌన్‌ని ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 ప్రాంతాల్లో లాక్‌ డౌన్‌ని పొడిగించింది.

ముక్కంటి చెంత కరోనా కలకలం 
లండన్‌ నుంచి వచ్చిన యువకుడు చికిత్స అనంతరం క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉన్నా వెళ్లలేదు. కుటుంబ సభ్యులు కూడా వారి వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇంట్లోనే ఉన్నా వైరస్‌ ఇంతగా వ్యాప్తి చెందేది కాదని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో కొందరు పట్టణంలో తిరగ టంతో పాటు సర్వేకు వచ్చిన అధికారులతో కలిసిపోయినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న అనుమానితులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా నిర్వాహకుల హెచ్చరికలను పెడచెవినపెట్టినట్లు సమాచారం. ఫలితంగా శ్రీకాళహస్తిలో వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యారని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన 15 మంది ద్వారా కొందరు అధికారులకు ఈ వైరస్‌ వ్యాప్తి చెంది ఉంటుందని కలెక్టర్‌ భరత్‌నారాయణ గుప్త భావిస్తున్నారు.

లాక్‌డౌన్‌ మరింత కఠినతరం 
జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన శ్రీకాళహస్తి, తిరుపతి, ఏర్పేడు, రేణిగుంట, నిండ్ర, పిచ్చాటూరు, నారాయణవనం, వడమాలపేట, పలమనేరు, గంగవరం, చంద్రగిరి మండలం రంగంపేటను రెడ్‌జోన్లుగా కలెక్టర్‌ ప్రక టించారు. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం నుంచి సడలింపు ఇచ్చినా కరోనా కేసులు నమోదు కావటంతో రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో పరిశ్రమలు తెరిచేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

ఇదిలావుండగా రెండు రోజుల్లోనే శ్రీకాళహస్తిలో అత్యధిక కేసులు నమోదు కావటంతో వారు ఎవరెవరిని కలిశారనే వివరాల ద్వారా అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. నివాసాల్లో ఉన్న వారిని, ఆ ప్రాంతంలో తిరుగుతున్న వారిని థర్మల్‌ స్కా నింగ్‌ చేస్తున్నారు. స్కానింగ్‌లో వ్యక్తు ల టెంపరేచర్‌ 40 డిగ్రీలు దాటితే క్వారంటైన్‌కి తరలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు